యూరియా కోసం యుద్ధం | Sakshi
Sakshi News home page

యూరియా కోసం యుద్ధం

Published Sat, Jan 3 2015 1:24 AM

యూరియా కోసం యుద్ధం

ఆత్మకూరురూరల్ :  తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు ఆలస్యమై ఆవేదన చెందుతున్న రైతును యూరియా కృత్రిమ కొరత వేధిస్తుంది. బ్లాక్ మార్కెట్‌లో యూరియాను అధిక ధరలు విక్రయిస్తుండటం, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఎమ్మార్పీకే యూరియా లభిస్తుండటంతో రైతులు ఎగబడుతున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరులోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఎమ్మార్పీ ధరలకే యూరియా లభ్యమవుతోంది.

ఈక్రమంలో వారం రోజు లుగా రైతులు ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం మూడు లోడ్ల యూరియా గ్రోమోర్ దుకాణానికి చేరడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యాలయ సిబ్బందికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒక కార్యాలయ ఉద్యోగి యూరియా కావాల్సిన రైతుల పేర్లు ఓ జాబితాలో నమోదు చేశాడు.

గ్రోమోర్ కేంద్ర కార్యాలయం నుంచి యూరియా పంపిణీ చేయాలని సకాలంలో ఉత్తర్వులు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా చేయలేదు. ఓ తరుణంలో మేనేజరు ఈశ్వర్‌రెడ్డితో రైతులు తగాదాకు దిగారు. దీంతో రైతులకు సమాధానం చెప్పలేక సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆత్మకూరు ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో గ్రోమోర్ కార్యాలయానికి చేరుకుని జాబితాలో ఉన్న ప్రకారం ప్రతి రైతుకు నాలుగు బస్తాల వంతన స్టాకు ఉన్నంత వరకు అందజేస్తారని క్యూలో నిలబడాలని సర్దుబాటు చేసి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement
Advertisement