ఎర్రకోటపై బీసీ జెండా ఎగరేస్తాం: ఆర్.కృష్ణయ్య | Sakshi
Sakshi News home page

ఎర్రకోటపై బీసీ జెండా ఎగరేస్తాం: ఆర్.కృష్ణయ్య

Published Sat, Aug 24 2013 1:02 AM

ఎర్రకోటపై బీసీ జెండా ఎగరేస్తాం: ఆర్.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్: ఎర్రకోటపై బీసీ జెండా ఎగురవేసి రాజ్యాధికారం సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిందన్నారు. న్యాయమైన ఈ డిమాండ్లు అమలు చేస్తేనే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దోమలగూడలోని ఎస్‌ఎంఎస్‌లో శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కష్ణ, ర్యాగ రమేష్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నూటపదకొండు సార్లు రాజ్యాంగాన్ని సవరించిన పాలకులు బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక్క సవరణనైనా చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. బీసీలకు పదవులు రాకుండా అగ్రకుల పెట్టుబడిదారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
 
  బీసీలకు కావల్సింది వాటాలు, కోటాలు కాదని, డిల్లీ పీఠం కావాలన్నారు. కేంద్రంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి చర్యలు తీసుకోవడంలేదన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో కనుమరుగవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 28 సార్లు సీఎంలను మార్చితే ఒక్క బీసీకి ఆ పదవి ఇవ్వలేదని, కాంగ్రెసు బీసీ నాయకుల్లో సమర్థులైన వారే లేరా? అని ప్రశ్నించారు. తాను బీసీ ఉద్యమకారుడిగానే ఉంటానే తప్ప ఒక ప్రాంతానికి పరిమితం కానని, రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో బీసీ ముఖ్యమంత్రినే నియమించాలన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలని తమపై ఒత్తిడి వస్తోందని, బీసీలకు న్యాయం చేయకపోతే ప్రజలే పార్టీని ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు.

Advertisement
Advertisement