కురుగొండ్లకు ఎసరు | Sakshi
Sakshi News home page

కురుగొండ్లకు ఎసరు

Published Sat, Dec 28 2013 3:58 AM

BC is a candidate in the next elections from the constituency...

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : వెంకటగిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే విషయమై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆ మేరకు నియోజకవర్గంలో ఒక సర్వే సంస్థ ద్వారా అభిప్రాయసేకరణ కూడా జరుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మిగిలిన పార్టీల నుంచి రేసులో ఉన్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కులసమీకరణల వైపు టీడీపీ దృష్టి కేంద్రీకరించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో ఒక దఫా బీసీలకు కేటాయించిన ప్రయోగం విఫలం కావడంతో సర్వే నివేదికలపై ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే తమకు పోటీ ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అయిన నేపథ్యంలో వెనుకబడిన తరగతుల నుంచి అభ్యర్థిని నిలిపితే వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. మరోసారి వెంకటగిరి నుంచి బీసీలకు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టయితే సిట్టింగ్ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకు వచ్చే ఎన్నికల్లో చుక్కెదురు కావచ్చు. వెంకటగిరి టికెట్ కోసం ఇప్పటి నుంచే కొందరు బీసీ నేతలతో పాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన ప్రముఖులు కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
 
  దీంతో ఆ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం అభ్యర్థి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. బీసీ వర్గాల నుంచి వెంకటగిరికే చెందిన పారిశ్రామికవేత్త, జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈయనకు రాష్ట్ర పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉత్తరాంధ్ర నేత యనమల రామకృష్ణుడు ఆశీస్సులు ఉన్నాయి. రామకృష్ణుడు, నాగేశ్వరరావులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అంతేకాకుండా గంగోటికి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత వంకి పెంచలయ్య కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి టికెట్టు ఆశిస్తున్నట్టు సమాచారం.
 
  ఈయన అభ్యర్థిత్వం కోసం ఎల్లో మీడియాకు చెందిన ఒక సంస్థ అధినేత తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా కిందటి ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి నువ్వుల మంజుల కూడా రేసులో ఉన్నారు. ఆమెకు చంద్రబాబు కోటరీలో ముఖ్యులైన సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావుల మద్దతు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున వెంకటగిరి టికెట్ ఆశిస్తున్నారు. ఈయన 2004 ముందువరకు తెలుగుదేశంలో ఉన్నారు.
 
 అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతగా చురుగ్గా లేని ఆయన ఇప్పుడు పాత పరిచయాలను పునరుద్ధరించుకుంటూ వెంకటగిరి టికెట్ కోరుతున్నట్టు సమాచారం. తిరుపతి మాజీ శాసనసభ్యులు చదలవాడ కృష్ణమూర్తి సతీమణి సుచరిత కూడా అవకాశం ఇస్తే వెంక టగిరి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఇవన్నీ ఇలా ఉండగా వెంకటగిరి రాజాల కుటుంబం నుంచి సర్వజ్ఞయాచేంద్ర పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కురుగొండ్ల రామకృష్ణ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement