అప్రమత్తంగా ఉండండి | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండండి

Published Tue, Mar 8 2016 3:01 AM

అప్రమత్తంగా ఉండండి

 సీఎం సభలో అవరోధాలు సృష్టించొచ్చు
బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి అదనపు ఎస్పీ ఆదేశాలు

 
కర్నూలు: సీఎం బహిరంగ సభలో కొంతమంది అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో సోమవారం సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయానికి తరలివచ్చారు. పరేడ్ మైదానంలో హాజరైన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందికి అదనపు ఎస్పీ సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు చెక్‌పోస్టు, బస్టాండు, రైల్వే స్టేషన్ లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద వీవీఐపీలను మాత్రమే అనుమతించాలని సూచించారు. 

అనుమానితులు కనిపించగానే సంబంధిత సెక్టార్ ఇన్‌చార్జీలకు వెంటనే సమాచారం అందించాలన్నారు. అనంతరం ఏపీఎస్‌పీ రెండవ పటాలంలోని హెలిప్యాడ్, ప్రభుత్వ అతిధిగృహం, ఔట్‌డోర్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ రిహార్సల్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కె.శ్రీనివాసులు, వై.హరినాథ్‌రెడ్డి, బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు.

 బాంబ్ స్వ్కాడ్ బృందాలుముమ్మర తనిఖీ:
మూడు బాంబ్‌స్క్వాడ్ బృందాలు, రెండు డాగ్‌స్వ్కాడ్ బృందాలు సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏపీఎస్‌పీ మైదానంలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ఔట్‌డోర్ స్టేడియంలోని బహిరంగ సభ స్థలం వరకు రోడ్లకు ఇరువైపులా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

 వాహనాల పార్కింగ్ స్థలాలు ఇవే  
వీఐపీ వాహనాల పార్కింగ్ ఎస్టీబీసీ కళాశాల మైదానం.
స్కూలు విద్యార్థులు, మహిళా సంఘాలు, ఇతర ప్రజలు తరలివచ్చే వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్.
బహిరంగ సభకు ప్రవేశ ద్వారాలు
వీవీఐపీలకు ఔట్‌డోర్ స్టేడియం మెయిన్‌గేటు, మహిళా సంఘాలు, స్కూలు విద్యార్థులకు సింహపురి కాలనీ స్కూలు గేటు, మున్సిపల్ ఆఫీసు గేటు ద్వారా ప్రవేశం.
 
 వాహనాల దారి మళ్లింపు
కర్నూలు నగరంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆదోని, కోడుమూరు వైపు నుంచి వచ్చే వాహనాలు బళ్లారి చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండు వైపు నిషేధం ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కల్లూరు, బిర్లాగేటు, కలెక్టరేట్, రాజ్‌విహార్ మీదుగా ఎగ్జిబిషన్ మైదానం చేరుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement