సమరమే.. | Sakshi
Sakshi News home page

సమరమే..

Published Sat, Sep 21 2013 1:22 AM

సమరమే..

వరద ఉధృతిని తలదన్నిన ఉద్యమ ఉరవడికి కృష్ణమ్మ చిన్నబోయింది.. మహిషాసుర మర్దనం కంటే ముందుగానే విభజనాసురుల సంహారానికి కదంతొక్కిన సమైక్యశ్రేణుల ధర్మాగ్రహాన్ని చూసి దుర్గమ్మ విస్తుబోయింది.. స్వరాజ్య మైదానం మరో స్వతంత్ర పోరాట పతాకైంది.    తెలుగుతల్లిని చెరబట్టిన నిజాంను తరిమికొట్టే యుద్ధతంత్రాలకు, గెరిల్లా దళాల శిక్షణకు నాడు కేంద్రమైన బెజవాడ.. ఆంధ్రప్రదేశ్‌ను  నిలువునా చీల్చే సోనియా, కేసీఆర్ దుష్ట ద్వయ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టే నేటి కురుక్షేత్ర మహాసంగ్రామానికి కమ్యూనిస్టు రుషి సుందరయ్య వేదిక నుంచి పాంచజన్యం పూరించింది. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు పురుడుపోసిన బూర్గుల రామకృష్ణారావు ప్రాంగణం కదనకుతూహలంతో కదంతొక్కింది. తెలుగు బిడ్డల సమైక్య సమరోత్సాహానికి మైమర్చిన మేఘుడు.. ఆగామి విజయానికి సంకేతంగా తన వ(హ)ర్షధారలతో విజయోస్తంటూ శుభాశీస్సులందించాడు.    
 
 సాక్షి, విజయవాడ : రాజకీయ రాజధాని బెజవాడలో సమైక్య రణభేరి మార్మోగింది. ఉద్యోగులు గర్జించారు. బెజవాడ వేదికగా ఉద్యోగులు సమైక్య రణభేరి సభను నిర్వహించి సత్తా చాటారు. జోరువానను సైతం లెక్కచేయకుండా ఉద్యోగులు కదంతొక్కారు. దీంతో విజయవాడ వీధులన్నీ ఉద్యోగ సంఘాలతో కిక్కిరిసిపోయాయి. కృష్ణా జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి నుంచి కూడా ఉద్యోగులు తరలివచ్చి విజయవాడలో జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.

ఉద్యోగుల సమరశంఖారావానికి అన్ని సంఘాలూ తోడవడంతో విజయవాడలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం అయింది. నిరంతరాయంగా వర్షం కురిసి అందరూ తడిసి ముద్దయిపోయినా ఒక్కరు కూడా సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్లకుండా వర్షంలోనూ అలానే కూర్చుని ఉండి సభను విజయవంతం చేశారు. మొత్తం మీద ఉద్యోగులు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవాడలో అర్థవంతంగా, అన్ని వర్గాల ప్రజల్నీ ఆలోచింపజేసేలా సాగింది.

బూర్గుల రామకృష్ణ ప్రాంగణంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వేదిక ద్వారా శుక్రవారం విజయవాడలో ఉద్యోగులు సమైక్యాంధ్ర శంఖారావం పూరించారు. సీమాంధ్ర జిల్లాలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ తొలి సభకు బెజవాడ వేదిక అయింది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా కేవలం ఎన్జీవో సంఘూలు నిర్వహించిన సభకు వేలాది ఉద్యోగులతో పాటు విద్యార్థులు, మహిళలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు పలు సంఘాల నేతలు తరలివచ్చారు. ఉద్యోగ సంఘ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటి నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చి సభలో పాల్గొన్నారు. తొలుత శంఖారావం చేసి సంఘనేతలు సభను ప్రారంభించారు.

ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు మా తెలుగుతల్లికి.. గీతం పాడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సభకు వచ్చిన విదేశీయులు కూడా జై సమైక్యాంధ్ర నినాదాలు చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమైక్యాంధ్ర పరిరక్షణ జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ అధ్యక్షోపన్యాసం చేశారు. అనంతరం వేదికపైకి ముఖ్యులను ఆహ్వానించారు.

రాష్ట్ర విభజన జరిగితే కలిగే నష్టాల్ని ముఖ్యంగా నీటివనరులు, ఆదాయ వనరులు, ప్రభుత్వ ఉద్యోగుల స్థితి, విద్యార్థుల భవిష్యత్తు, వైద్య రంగానకి కలిగే నష్టాలు, ఆర్టీసీకి కలిగే ఇబ్బందులు, వివిధ వర్గాలకు కలిగే నష్టాలు ఇలా అన్ని అంశాలపై సభలో మేధావులు ప్రసంగాలు చేసి సమైక్యరాష్ట్రాన్ని ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు. సమైక్య స్ఫూర్తి ప్రతిబింబించేలా, ప్రతి ఒక సామాన్యుడి మదిలోకి సమైక్య ఉద్యమాన్ని జొప్పించేలా సభను అర్థవంతంగా నిర్వహించటంలో నిర్వాహకులు విజయవంతమయ్యారు. గత 50 రోజులగా సీమాంధ్రలో పతాకస్థాయికి చేరిన ఉద్యమాలకు ముందుండి రథసారథుల్లా ఎన్జీవో సంఘాలు నడిపిస్తున్నాయి.

ఎలాంటి స్వలాభం చూసుకోకుండా ఒక్కటే నినాదం.. ఒక్కటే ఎజెండా అన్న రీతిలో సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం మహోద్యమంలా మారిందని ఉద్యమం సాగుతున్న వైనాన్ని తొలుత సభా ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వివరించారు. స్ఫూర్తి రగిలించే సమైక్య గీతాలు, సామాన్యులకు అర్థమయ్యేరీతిలో సంభాషణలతో కూడిన నృత్యరూపకం అందరినీ అలరించింది. నాలుగు గంటలకు పైగా సాగిన ప్రసంగాల ద్వారా ఢిల్లీకి వినిపించేలా సమైక్య శంఖారావం పూరించారు. సభకు వచ్చిన జనంతో బెజవాడలో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిశాయి.

 స్ఫూర్తి నింపిన ప్రసంగాలు

 సభకు హాజరైన నేతలు, వివిధ రంగాల మేధావులు చేసిన ప్రసంగాలు అందరిలో స్ఫూర్తి నింపాయి. రాష్ట్రం మూలాలు, మన రాష్ట్ర చరిత్రను కొందరు వివరించారు. 15వ శతాబ్దంలో హైదరాబాద్ నగర నిర్మాణానికి వాడిన ప్రతి రూపాయి మనదేనని మేధావులు నినదించారు. ఇది ధర్మయుధ్ధం అని.. ప్రజాపోరాటంలో మనదే అంతిమ విజయం అని నేతలు చేసిన ప్రసంగాలకు చపట్లతో సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానం తీరుపైనా, సోనియాగాంధీ పైనా నేతలు విమర్శల జడివాన కురిపించారు. కొందరు సోనియాగాంధీని అభినవ కైకేయి అని విమర్శించారు. మరోవైపు వేలాదిగా మహిళా ఉద్యోగులు తరలివచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటుచేశారు.

 హాజరైన సంఘాలు..

 సభకు ఎన్జీవో సంఘాలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ, ఎంప్లాయీస్ యూనియన్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, రెవెన్యూ సంఘాలు, నగరపాలక సంస్థ జేఏసీ, మాలమహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, విజయవాడ బార్ అసోసియేషన్, విద్యార్థి జేఏసీ, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement