మృత్యువులోనూ వీడని స్నేహబంధం | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని స్నేహబంధం

Published Thu, Aug 20 2015 1:16 AM

మృత్యువులోనూ  వీడని స్నేహబంధం - Sakshi

రాంగ్ రూట్‌లో వెళ్తూ బైక్‌ను ఢీకొన్న టిప్పర్
యువకులు నగరంలో  చిరు వ్యాపారులు

 
రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ ముగ్గురు యువకుల ప్రాణాలను హరించింది. కంచికచర్లలోని పేరకలపాడుకు చెందిన బండి నాగరాజు, బురదగుంట మధు, దోమ కోటేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా పరిటాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.  వీరు నగరంలోని బీసెంట్‌రోడ్డులో ఫ్యాన్సీ డ్రెస్సుల వ్యాపారం చేస్తుంటారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ముగ్గురు స్నేహితులు చిన్నప్పటి నుంచి అన్యోన్యంగా మెలిగారని, మృత్యువులోనూ వీరి స్నేహబంధం వీడిపోలేదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
 
కంచికచర్ల : రాంగ్ రూట్‌లో వెళ్తుతున్న టిప్పర్ బైక్‌ను ఢీకొట్టి ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ దుర్ఘటన కంచికచర్ల మండలం, పరిటాల వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామానికి చెందిన బండి నాగరాజు (22), బురదగుంట మధు (30), దోమ కోటేశ్వరరావు (తంబి) (23) విజయవాడ బీసెంట్ రోడ్డులో తోపుడుబండ్లపై చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ యువకులు బుధవారం ఉదయం ఇబ్రహీంపట్నం లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి  బైక్‌పై వెళ్లారు. బంధువులతో కొంతసేపు ఆనందంగా గడిపి అదే బైక్‌పై తిరిగి ఇంటికి బయలుదేరారు. మండలంలోని పరిటాల సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ముందు వెళ్తున్న వాహనాన్ని బైక్ ఓవర్‌టేక్ చేసే సమయంలో కంచికచర్ల వైపు నుంచి విజయవాడ వైపు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న దొనబండ పవన్ గ్రానైట్‌కు చెందిన టిప్పర్ బైక్‌ను ఢీకొంది. టిప్పర్ ఆగకుండా కిందపడిన ముగ్గురిపైనుంచి ముందుకు వెళ్లింది తీవ్రంగా గాయపడిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదం తరువాత పరారవుతున్న టిప్పర్ డ్రైవర్‌ను సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు పట్టుకుని పోలీస్‌స్టేష న్‌లో అప్పగించారు. నందిగామ డీఎస్పీ టి.రాధేష్‌మురళీ, రూరల్ సీఐ వై.సత్యకిషోర్, ఎస్‌ఐ కె. ఈశ్వరరావు, నందిగామ ఆర్టీవో సురేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృుతదేహాలను పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
శుభకార్యానికి వెళ్లి వస్తున్న నాగరాజు, కోటేశ్వరరావు, మధును టిప్పర్ రూపంలో వృుత్యువు కాటేసిందని తెలియడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement