‘మధ్య’ మిథ్యేనా!? | Sakshi
Sakshi News home page

‘మధ్య’ మిథ్యేనా!?

Published Mon, Apr 7 2014 1:26 AM

‘మధ్య’ మిథ్యేనా!? - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఐదేళ్లుగా టీడీపీని బలోపేతం చేసిన బొండా ఉమకు కాకుండా.. ఆ సీటును బీజేపీకి వదిలి వేయడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వారు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టుభవన్ వద్ద ధర్నా చేసి లోపలికి దూసుకెళ్లారు. అదే సమయంలో నగరంలోని బొండా ఉమ కార్యాలయం ఎదుట సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఐదేళ్లపాటు కోట్లు కుమ్మరించి పార్టీని బతికిస్తే ఇప్పుడు సీటు బీజేపీకి ఏ విధంగా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
 
పలుమార్లు బాబుకు విజ్ఞప్తి..
 
సెంట్రల్ సీటు టీడీపీకే ఉంచాలంటూ బొండా ఉమ అనుచరులు ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల ఆయన ఏలూరు వెళుతూ నగరానికి వచ్చినప్పుడు, మహిళాగర్జన నిర్వహించినప్పుడు కూడా ప్లకార్డులు ప్రదర్శించి తమ అభిప్రాయం తెలిపారు. అయినా చంద్రబాబు సీటును కమలనాథులకు వదిలివేయడంపై తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాన్ని తెలిపి బీజేపీని ఓడిస్తామంటూ శపథం చేస్తున్నారు.
 
బీజేపీలో ‘స్థానిక’ సమరం

టీడీపీతో పోత్తులో భాగంగా లభించిన సీటు స్థానికులకే కేటాయించాలంటూ సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. నగరానికి వచ్చిన ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును స్థానిక నాయకులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మాజీ కార్పొరేటర్ కె.గణేశ్ తదితరులు కలిసి దిగుమతి చేసుకున్న వ్యక్తులకు కాకుండా స్థానికులకే సీటు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. పొత్తువల్ల చాలామంది ఆశావహులకు నిరాశే మిగులుతుందని, జిల్లాలో వచ్చే ఒకటిరెండు సీట్లు కొత్తవారికి ఇస్తే ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏమిటంటూ నిలదీసినట్లు సమాచారం. దీనిపై హరిబాబు మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిశీలిస్తామంటూ సర్దిచెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement