ఇరు రాష్ట్రాల మధ్య ‘పారామెడికల్’ అగ్ని | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాల మధ్య ‘పారామెడికల్’ అగ్ని

Published Tue, May 5 2015 1:15 AM

ఇరు రాష్ట్రాల మధ్య ‘పారామెడికల్’ అగ్ని

బోర్డు కార్యదర్శిపై పలు ఆరోపణలు
పదవి నుంచి తప్పుకోవాలంటూ
ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు
తెలంగాణలో పనిచేస్తున్నందువల్ల
మీకు ఆ అధికారం లేదన్న బోర్డు కార్యదర్శి
రెండుసార్లు ఆదేశించినా నో కేర్

 
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో వివాదాగ్ని రాజుకుంది. పారామెడికల్ బోర్డుకు కార్యదర్శి నియామకంలో ఆధిపత్యంకోసం ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ బోర్డులో కోట్లాది రూపాయల నగదు నిల్వలుండడం ఆధిపత్య అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. పారామెడికల్ కళాశాలల నిర్వహణ, అనుమతులు, సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ తదితరాలన్నింటినీ పారామెడికల్ బోర్డు చూస్తుంది. దీంతోపాటు రెండు రాష్ట్రాల కార్యకలాపాల్నికూడా నిర్విహ స్తుంది. ఈ బోర్డు కార్యదర్శిగా రిటైర్డ్ ఉద్యోగి బీఎన్ కుమార్‌ను అప్పటి ఉమ్మడి ప్రభుత్వం నియమించింది.


ఈ నేపథ్యంలో కుమార్‌పై పలు ఆరోపణలొచ్చాయి. దీంతో బోర్డు కార్యదర్శి బాధ్యతల నుంచి  తప్పుకోవాలని, వైద్యవిద్యా సంచాలకులు ఆ బాధ్యత ల్ని చేపట్టాలంటూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు అందుకున్న బోర్డు కార్యదర్శి.. ‘ప్రస్తుతం పారామెడికల్ బోర్డు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నా నియమాకం ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. తెలంగాణలోనే పనిచేస్తున్నందువల్ల నన్ను బాధ్యతల నుంచి తప్పుకోమని సూచించే అధికారం మీకు లేదు’ అంటూ ఘాటుగా సమాధాన మిచ్చారు.


దీంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విస్తుపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైనందువల్ల పదవి నుంచి కచ్చితంగా దిగిపోవాల్సిందేనంటూ రెండోసారీ ఆదేశాలు జారీచేశారు. అయితే కుమార్ తిరిగి అదే సమాధానమిచ్చారు. పారామెడికల్ బోర్డులో కార్యదర్శిగా పనిచేస్తున్న బీఎన్ కుమార్ ఏపీకి చెందిన వ్యక్తి. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఉన్నందువ ల్లనే సీనియర్ ఐఏఎస్‌ను ప్రశ్నించగలిగారంటూ అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి.


ఇదిలా ఉండగా బాధ్యతల నుంచి తప్పుకోం డంటూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందుకున్న కార్యదర్శి కుమార్ బోర్డులో పనిచేస్తున్న నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని  ఉన్నఫళంగా తీసేశారు. దీంతో వివాదం బాగా ముదిరింది. బోర్డు పరిధిలో రూ.7 కోట్ల నగుదు నిల్వలున్నాయి. ఇవి ఎవరికి ఎలా వాటా ఇవ్వాలనే విషయం కూడా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కాగా, ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరికి కోపం ఉంటే వాళ్లు చూసుకోవాలి గానీ చిన్న ఉద్యోగులమైన తమను తొలగించడమేంటంటూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు.

Advertisement
Advertisement