బెజవాడ ఎక్స్‌ప్రెస్! | Sakshi
Sakshi News home page

బెజవాడ ఎక్స్‌ప్రెస్!

Published Mon, Sep 29 2014 2:16 AM

బెజవాడ ఎక్స్‌ప్రెస్!

అన్ని జిల్లాల నుంచి నూతన రాజధాని విజయవాడకు రైలు, బస్సు మార్గాలు ఉండేలా చూస్తామంటున్న ప్రభుత్వం మన జిల్లా గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఒక్కటంటే ఒక్క రైలు సౌకర్యం కూడా లేదు. జిల్లాలో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న మూడు రైలు మార్గాలను పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
 
 రాజంపేట:
 రాష్ట్ర నూతన రాజధాని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి రాజధాని నగరానికి వెళ్లేందుకు రైలు మార్గం ఎటు అనే అంశంపైనే ఉంది. రాజధాని కేంద్రాన్ని కలిపేందుకు ప్రతి జిల్లా నుంచి రైలు, రోడ్డు మార్గాలు ఉండాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. కానీ వైఎస్సార్ జిల్లా గురించి మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇంతవరకు హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా రైలు, బస్సు సౌకర్యాలు ఉండేవి. కానీ ప్రస్తుతం కొత్త రాజధాని విజయవాడవైపు రైలులో వెళ్లాలంటే రేణిగుంట జంక్షన్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇది తప్ప మరో మార్గం లేదు.
 సర్వే దశలోనే ఆ మూడు రైలు మార్గాలు
 జిల్లా నుంచి మూడు రైలు మార్గాలు కొత్తగా ఏర్పడబోయే రాజధానికి అనుకూలంగా ఉన్నాయి. అవి కంభం-ప్రొద్దుటూరు, భాకరాపేట-గిద్దలూరు, ఓబులవారిపల్లె - కృష్ణపట్నం రైలుమార్గాలు. వీటిలో రెండులైన్లు మాత్రం సర్వేకే పరిమితమయ్యాయి. ఈ లైన్ల మార్గం ఏర్పాటు దశాబ్దాల కాలం నుంచి కలగానే మిగిలిపోయింది. ఈ లైన్లు పూర్తయితే ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలను అనుసంధానం చేసినట్లవుతుంది. అక్కడి నుంచి విజయవాడకు మరో రైలులో వెళ్లాల్సి ఉంటుంది. 2010-2011 రైల్వేబడ్జెట్‌లో కూడా కొత్త రైల్వే లైన్‌గా కంభం-ప్రొద్దుటూరును ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013-2014 బడ్జెట్‌లో ఈ లైన్‌కు రూ.10లక్షలు కేటాయించారు. తాజాగా ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ 2014లో కంభం-ప్రొద్దుటూరు రైల్వేలైన్‌కు రూ.10లక్షలు విదిల్చారు. ఇలాంటి పరిస్థితిలో ఈ రైల్వే మార్గం పూర్తయ్యేదెప్పుడు విజయవాడ వైపు రైళ్లు తిరిగేదెప్పుడు అనే చర్చ జరుగుతోంది.
 మార్గం తీరు ఇలా..
 కంభం-ప్రొద్దుటూరు మధ్య కొత్త రైల్వేలైన్ 142 కిలోమీటర్ల మేర ఉండేటట్లు రూట్‌ను ఖరారు చేశారు. దాదాపు రూ.829 కోట్ల వ్యయాన్ని ఈరైల్వేలైన్‌కు అంచనా వేశారు. కంభం-ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వేను ప్రతి బడ్జెట్‌లో ప్రస్తావిస్తూ వచ్చారు. ఆరేళ్ల క్రితం ఈ లైనుకు ప్రాథమికంగా సర్వేలు చేసి వదిలిపెట్టారు. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు, బద్వేలు, గిద్దలూరు లైనుకు కలిపే విధంగా మార్గం రూట్‌కు ఒక దశలో రూపకల్పన చేసినట్లు రైల్వే వర్గాల సమాచారం. ఫైనల్ సర్వే చేసిన తర్వాతే లైను మార్గం ఒక రూపానికి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే గత యూపీఏ ప్రభుత్వంలో భాకరాపేట-గిద్దలూరు రైల్వేమార్గం ఏర్పాటుకు సర్వేకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.  భాకరాపేట, సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల, గిద్దలూరు వరకు లైన్ వేసే విధంగా సర్వే కొనసాగింది. ఈ రెండు మార్గాలు కూడా ఒకే దిశలో ఉండటంతో ఏ మార్గంలో రైల్వేలైను తీసుకెళతారనేది ఇప్పుడు రైల్వేవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
 రాజధానికైతే .. కృష్ణపట్నం రైల్వేలైన్
 కొత్త రాజధానికైతే ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్ ఒకటే అందుబాటులో ఉంది. అది కూడా పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందో..ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ మార్గంలో వెలుగొండల టన్నెల్ పనులు ఇంకా ప్రారంభంకాలేదు. ఇప్పట్లో ఈ పనులు ప్రారంభమవుతాయన్న నమ్మకం రైల్వేవర్గాల్లో లేదు. ఈ రైల్వేలైన్ తిరుపతి-విజయవాడ లైనుకు అనుసంధానమవుతుంది. దీని వల్ల రాజధానికి ఈ మార్గం మీదుగా రైళ్లు చేరుకునే అవకాశం ఉంది. కానీ మార్గం పూర్తి కావడమే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి వైఎస్సార్ జిల్లా నుంచి విజయవాడకు రైలు మార్గంలో చేరుకునే అవకాశం ఇప్పట్లో లేనట్లేనని చెప్పవచ్చు. జిల్లా కు చెందిన  ప్రజాప్రతినిధులు కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయించి పనులు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.



 

Advertisement
Advertisement