భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో విలీనం చేయాలి | Sakshi
Sakshi News home page

భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రాలో విలీనం చేయాలి

Published Thu, Aug 8 2013 4:19 AM

Bhadrachalam division should merge with Andhra region

భద్రాచలం , న్యూస్‌లైన్: భద్రాచలం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేసి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయాలని భద్రాచలం పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భద్రాచలానికి చెందిన గిరిజన, గిరిజనేతర సంఘాలు కలిపి ఏర్పాటు చేసుకున్న భద్రాచలం పరిరక్షణ కమిటీ బుధవారం పట్టణంలోని రాజుల సత్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆ కమిటీ కన్వీనర్ పివిఎస్ విజయ్‌వర్మ మాట్లాడుతూ....1956 సంవత్సరానికి ముందు నుంచి  భద్రాచలం డివిజన్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేదని, పరిపాలనా సౌలభ్యం కోసం నాడు ఖమ్మం జిల్లాలో కలిపారని అన్నారు.  నేడు అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా వెళ్తున్న భద్రాచలాన్ని  ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించటం ద్వారా స్థానిక గిరిజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 అలాకాకుండా తెలంగాణలో భద్రాచలాన్ని కల్పితే భద్రాచల ప్రాంతం పూర్తిగా తమ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులు మొదట 1956కు ముందు ఉన్న తెలంగాణ కావాలని పోరాటాలు చేసి నేడు తెలంగాణ పై మాట మార్చటం దారుణమని, ఇది ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని అన్నారు. చిల్లర వాదనలు చేసి ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తే ఇక్కడి ప్రజానీకం తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. భద్రాచలానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విద్యా, ఉద్యోగ, నీటి, రవాణా, ఆరోగ్య రంగాలలో ముందుకు తీసుకెళ్లడం ద్వారానే ఇక్కడ నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.  
 
 ఆంధ్రాలో భద్రాచలం ప్రకటన వచ్చే వరకు సంతకాల సేకరణ, ధర్నాలు వంటి కార్యక్రమాలు అన్ని సంఘాలు, పార్టీల వారు చేయటానికి నిశ్చయించినట్లుగా ఆయన పేర్కొన్నారు.  వాస్తవ కోణంలో ఆలోచించి స్థానిక ఎమ్యేల్యే, ఎంపీలు వ్యవహరించాలని లేకుంటే ఇక్కడ ప్రజానీకం దృష్టిలో చరిత్రహీనులుగా  మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏవిఎస్‌పి నాయకులు సున్నం వెంకటరమణ, సి వెంకన్నరాజు, మన్నెసీమ అధ్యక్షులు చిచ్చడి శ్రీరామమూర్తి, గిరిజన నాయకులు కారం సత్తిబాబు, సున్నం లక్ష్మయ్య, మర్మం నర్సింహారావు, గొంది బాలయ్య, నాగయ్య, అపక శ్రీను, తుడుందెబ్బ వీరస్వామి, ఉబ్బ వేణు, సయ్యద్ మున్నాకర్, కల్లూరి ఆదినారాయణ, కృష్ణంరాజు, కొరస రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement