‘నంద్యాల ప్రజలకు మహత్తర అవకాశం’ | Sakshi
Sakshi News home page

‘నంద్యాల ప్రజలకు మహత్తర అవకాశం’

Published Thu, Aug 3 2017 3:38 PM

‘నంద్యాల ప్రజలకు మహత్తర అవకాశం’ - Sakshi

నంద్యాల: వంచన, కుట్ర, కుళ్లిన రాజకీయాలకు చంద్రబాబు మారుపేరని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అమరావతిని వదిలి మంత్రులందరూ నంద్యాలలో తిష్టవేశారని తెలిపారు. అవినీతి సొమ్మును పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నంద్యాలలో ఉన్నది మంత్రులా లేక మంత్రగాళ్లో అర్థం కావడం లేదన్నారు. అఘోరాల కంటే అధ్వాన్నంగా ప్రజల ఆశయాలను చేతబడి చేసే మంత్రగాళ్లలాగ మంత్రులు తయారయ్యారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా అభివృద్ధి చేసివుంటే మంత్రులంతా అమరావతిని వదిలి నంద్యాలలో ఎందుకు తిష్టవేశారని, 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు దించారని ప్రశ్నించారు.  

టీడీపీ పాలనకు వ్యతిరేకంగా అందరూ తిరగబడుతుండడంతో భయపడిపోయి... చంద్రబాబు ప్రతి ఒక్కరిని నలిపేయాలని చూస్తున్నారని భూమన మండిపడ్డారు. బాబు మూడేళ్లుగా చేసిన ద్రోహానికి తీర్పు ఇచ్చేందుకు మహత్తర అవకాశం నంద్యాల ప్రజలకు దక్కిందని.. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనను పాతరేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భూమన తెలిపారు.  ప్రజలంతా వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిసి బాబు ఓటర్లను భయభ్రాంతులను గురిచేస్తూ హింసాయిత వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు.

ముఠా రాజకీయాలు చేస్తూ పోలీస్ యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలు జరపాలన్న కుట్ర చేస్తున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, బాబు హింసాయుత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వందలకోట్లు పంచేందుకు చంద్రబాబు లారీల్లో రూ. 2వేల కోట్లను నంద్యాలకు తరలించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నిఘా సంస్థలు, ఇన్ కం ట్యాక్స్ సంస్థలన్నీ బాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని భూమన సూచించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు బెదిరే కుందేళ్లు వైఎస్సార్సీపీలో లేరని భూమన అన్నారు.

 

Advertisement
Advertisement