దోచేయ్.. జల్సా చెయ్! | Sakshi
Sakshi News home page

దోచేయ్.. జల్సా చెయ్!

Published Fri, Dec 25 2015 12:51 AM

దోచేయ్.. జల్సా చెయ్!

విజయవాడ సిటీ : బైక్ చోరీలు చేస్తూ జల్సా చేస్తున్న దంపతుల గుట్టును సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. కొట్టేసిన బైకులను ఆన్‌లైన్‌లో పెట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్న వీరిని అరెస్టు చేసి 15 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ ఎల్.కాళిదాస్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చిట్టినగర్‌లోని సాయిరామ్ థియేటర్ ప్రాంతానికి చెందిన చెన్నా సాగర్ (25) ఇటీవల స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి తరచూ స్టార్ హోటళ్లకు వెళ్లి జల్సా చేసేవారు.
 
 ఇందుకు అవసరమైన డబ్బు కోసం స్వర్ణలత భర్తను బైక్ దొంగతనాలకు పురిగొల్పింది. ఆపై తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో నకిలీ పత్రాలు తయారు చేసి ఆన్‌లైన్‌లో బైక్‌లు అమ్మేవారు. తాళం వేయని బైక్‌లు, బైక్‌లోనే వాహనం అసలు పత్రాలు ఉన్నవాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇద్దరూ కలిసి సరదాగా తిరుగుతూ చోరీ చేయాల్సిన బైక్‌ను ఎంచుకునేవాళ్లు. ఆపై ఆ బైక్‌ను చోరీ చేసి భర్త వస్తుంటే, అక్కడికి తాము వెళ్లిన బైక్‌ను స్వర్ణలత నడుపుకుంటూ వచ్చేది. ఇప్పటివరకు విజయవాడలో 12, గుంటూరులో 2, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున మోటార్ సైకిళ్లు చోరీ చేశారు.
 
 అమ్మకం ఇలా...
 చోరీ చేసిన మోటారు సైకిళ్లకు కంప్యూటర్ ద్వారా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఆపై కొత్త సిమ్ కార్డును తీసుకుని ఉపయోగిస్తారు. ఆ సిమ్ ద్వారా ఓఎల్‌ఎక్స్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్‌లో అమ్మకానికి పెడతారు. అందులోనే మోటారు సైకిల్ కండిషన్, రేటును కూడా పేర్కొంటారు. ఎవరైనా వీటిని కొనుగోలు చేసిన తర్వాత మరుసటి రోజు వాహనం రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయానికి వస్తానని చెబుతారు. అంతే ఆపై ఆ మొబైల్ ఫోన్ పనిచేయదు. చేసేది లేక కొనుగోలు చేసిన వాహనాలను వినియోగదారులు అలాగే వినియోగిస్తుంటారు.
 
 ఇలా చిక్కారు..
 తాను మోటారు సైకిల్ కొనుగోలు చేసిన మరుసటి రోజునే రిజిస్ట్రేషన్‌కు వస్తానని చెప్పిన వ్యక్తి సిమ్ కార్డు పని చేయడం లేదని గుర్తించిన ఓ బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు రంగంలోకి దిగి సిమ్ కార్డు ఆధారంగా కూపీ లాగితే దంపతుల బండారం బయటపడింది. అరెస్టు చేసిన నిందితుల నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
Advertisement