పుట్టిన రోజే.. చివరి రోజు | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజే.. చివరి రోజు

Published Tue, Jun 24 2014 4:15 AM

పుట్టిన రోజే.. చివరి రోజు - Sakshi

- బాలుడి ఉసురు తీసిన ఆర్టీసీ బస్సు
కొమరోలు :
పుట్టిన రోజునాడే ఆ బాలుడికి చివరి రోజైంది. తిరునాళ్లకు తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ బాలుడిని ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. ఈ సంఘటన మండలంలోని బావాపురంలో సోమవారం జరిగింది. వివరాలు.. బావాపురం గ్రామానికి చెందిన ముత్తుముల భాస్కర్‌రెడ్డి కుమార్తె కవితను రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన సైనికుడు శివభాస్కర్‌రెడ్డికిచ్చి వివాహం జరిపించారు. వీరికి భద్రినాథ్‌రెడ్డి, చరణ్‌రెడ్డిలు కుమారులు.

ఈ నేపథ్యంలో తాత, అవ్వ ఊరైన బావాపురంలో శ్రీ రామస్వామి తిరునాళ్లకు రెండు రోజుల క్రితం మనువళ్లు తల్లితో కలిసి వచ్చారు. సోమవారం చరణ్‌రెడ్డి పుట్టిన రోజు కావటంతో ఇంట్లో సందడిగా ఉంది. చుట్టుపక్కల ఉన్న చిన్నారులను చరణ్ ఉదయాన్నే కలిసి సాయంత్రం తన పుట్టినరోజు వేడుకలకు రావాలని పిలిచాడు. అనంతరం ఇంట్లో టిఫిన్ చేస్తున్నాడు.

టిఫిన్ ఇంకా కావాలని అడుగటంతో తెచ్చేందుకు తల్లి కవిత ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో నుంచి తిరిగి వచ్చేసరికి రోడ్డుపై చరణ్‌రెడ్డి (3) మృతదేహమై కనిపించాడు. దూరంగా ఉన్న గ్రామస్తులు విషయాన్ని గమనించి పిల్లవాడిని తొక్కించి వెళ్లిపోతున్న గిద్దలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. తల్లి కవిత, అమ్మమ్మ భాగ్యలక్ష్మి, తాత భాస్కర్‌రెడ్డి దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఎస్సై రామానాయక్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

శవపంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చరణ్‌రెడ్డి స్వగ్రామం అనుమలవీడులో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి తాత ముత్తుముల భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement