అమెరికా టూరులో సీఎంకు చేదు అనుభవం | Sakshi
Sakshi News home page

అమెరికా టూరులో సీఎంకు చేదు అనుభవం

Published Thu, Sep 27 2018 4:26 AM

Bitter experience to Chandrababu in American tour - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు అమెరికా యాత్రలో చేదు అనుభవం చవిచూశారు. తన పర్యటన సందర్భంగా టీడీపీ ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఇటీవల అమెరికాలో బయల్పడిన సినీతారల సెక్స్‌రాకెట్‌ వ్యవహారంలోని నిందితులను పక్కన పెట్టుకుని ప్రసంగించడంపై సభికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై పలువురు సభికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సెక్స్‌రాకెట్‌ వ్యవహారంలో నిందితుల్ని పక్కన పెట్టుకుని ప్రసంగించడమేమిటని, వారిని తక్షణం వేదిక నుంచి దించేయాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఈ సందర్భంగా అరుపులు, కేకలతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సీఎం ఈ నెల 23న అమెరికాకు వెళ్లడం తెలిసిందే. అదేరోజున విశాఖ మన్యంలో ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపారు.

జంట హత్యల విషయాన్ని ప్రయాణంలోనే తెలుసుకున్న చంద్రబాబు అనంతరం అమెరికాకు చేరుకున్నాక న్యూజెర్సీలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించేందుకు ఉద్యుక్తుడయ్యారు. అయితే ఆయన ప్రసంగం ప్రారంభించగానే సభికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. సినీతారల సెక్స్‌ రాకెట్‌లో నిందితులు మీ పక్కన కూర్చుని ఉన్నారని, ముందు వారిని వేదిక నుంచి కిందకు దించాలంటూ కేకలకు దిగారు. వారి అరుపులు, కేకలతో సభలో తీవ్ర కలకలం రేగింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక తొలుత అయోమయానికి లోనైన చంద్రబాబు.. తర్వాత ప్రసంగాన్ని ఆపి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా కార్యక్రమ నిర్వాహకులు జోక్యం చేసుకుని సెక్స్‌రాకెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని సముదాయించారు. టీడీపీ ఎన్నారైల నుంచి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురవడంతో కంగుతిన్న సీఎం చంద్రబాబు అనంతరం ప్రసంగాన్ని కొనసాగించినప్పటికీ ఏపీలో మావోయిస్టులు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత్య చేశారని, వారి మృతికి తన సంతాపం తెలుపుతున్నానంటూ తన ఉపన్యాసాన్ని ముగించేయడం గమనార్హం.

సెక్స్‌రాకెట్‌ వ్యవహారంలో జరిగిందిదీ...
సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సినీతారలను అమెరికాకు తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారంటూ గత జూన్‌లో కేసు నమోదవడం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న చికాగో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రస్తుత అధ్యక్షుడు సతీష్‌ వేమనతోపాటు పలువురిని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) విచారించడంతో కలకలం రేగింది. తానా నుంచి సినీతారలకు ఆహ్వానాలు వెళ్లడం, మెయిల్స్‌ వెళ్లడంతోపాటు ఆయన బ్యాంకు ఖాతా నుంచి కూడా పెద్దమొత్తంలో సినీతారలకు డబ్బులు వెళ్లాయని ఎఫ్‌బీఐ సమాచారం సేకరించడంతో వేమన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని అప్పట్లో ప్రచారం జరిగింది.

నిజానికి ఆరు నెలలక్రితం దొరికిన ఒక కాగితం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ పలు కీలక ఆధారాలు సేకరించి పాత్రధారులైన మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులను అదుపులోకి తీసుకున్నాయి. తెలుగువారి ఆహ్వానం మేరకు అమెరికాకు వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు విందు, వినోదాల్లో పాల్గొనడంలో తప్పులేదని, కానీ ఆ పేరుతో వచ్చి వ్యభిచారం చేయడమే పెద్ద నేరంగా ఎఫ్‌బీఐ భావిస్తోంది. ముఖ్యంగా వేరొక పేరుతో విదేశీయులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎఫ్‌బీఐ అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు అన్నింటినుంచీ సినీ తారలు, ప్రముఖులు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. వారు ఏ కార్యక్రమానికి వచ్చి ఏం చేశారు అనే కోణాల్లో విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తానా అధ్యక్షుడు సతీష్‌ వేమనతోపాటు పలువురు టీడీపీ ఎన్నారైలున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమెరికా యాత్రలో భాగంగా టీడీపీ ఎన్నారైలు నిర్వహించిన సభలో కొందరు సినీతారల సెక్స్‌రాకెట్‌ నిర్వాహకులు ఉండటం సభికుల్లో తీవ్ర అసహనం కలిగించింది. దాంతో వారు తమ అసహనాన్ని అరుపులు, కేకల రూపంలో సీఎం ముందు వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement