రాష్ట్రాభివృద్ధికి కట్టుబడిన బీజేపీ | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధికి కట్టుబడిన బీజేపీ

Published Tue, Feb 24 2015 5:35 AM

BJP district president muvvala venkata ramana rao

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారావు
ఒంగోలు :బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని, టీడీపీ-బీజేపీ పొత్తును సహించలేని కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు అన్నారు. సోమవారం స్థానిక మౌర్యా హోటల్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత లోటు బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదుకుంటుందని, కానీ రాష్ట్రంపై ఉన్న అభిమానంతో ముందుగానే నిధులు విడుదల చేసిన ఘనత మోడీకే దక్కుతోందన్నారు.

లక్ష కోట్ల వ్యయం అయ్యే పోలవరం ప్రాజెక్టును సైతం కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చిందని, అంతే కాకుండా 10 ఉన్నత విద్యాసంస్థలకు రూ.750కోట్లు కూడా కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటికి సంబంధించి ప్రణాళికలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లే నిధులు విడుదల కాలేదన్నారు. దీంతో పాటు రాజధాని నిర్మాణానికి సంబంధించి పరిపాలనాపరమైన భవనాల కోసం మాత్రమే నిధులు కేంద్రం విడుదల చేస్తుందని చెప్పారు.  

బీజేపీ రాష్ట్ర నాయకుడు బత్తిన నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్ అవతరించిందంటే.. అది కేవలం మోడీ పుణ్యమేనన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గం పెండింగ్‌లో పడిందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన దృష్టిసారించాలన్నారు. మైనార్టీలకు బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని శక్తులు దుష్ర్పచారం చేస్తున్నాయని , మోడీ నాయకత్వంలోనే తమకు రక్షణ ఉందని నేడు మైనార్టీలు భావిస్తున్నారని భారతీయ జనతా మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు ఖలీఫాతుల్లా బాషా అన్నారు. పార్టీ పట్ల ముస్లింలను మరింతగా ఆకర్షించేందుకు ‘‘దేశ్ బచావో- బీజేపీ మే ఆవో- ఘర్ సజావో’’ పేరిట కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు కనుమాల రాఘవులు, మీడియా ఇన్‌చార్జి మాదాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement