టీ బిల్లుపై బీజేపీ చర్చ! | Sakshi
Sakshi News home page

టీ బిల్లుపై బీజేపీ చర్చ!

Published Mon, Sep 9 2013 2:39 AM

BJP to Discuss on Telangana Bill on Sept 21

సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశం మేరకు బీజేపీ అగ్రనేతలు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈనెల 21న హైదరాబాద్ రానున్నారు. పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ప్రసంగిస్తారు. అనంతరం జిల్లాల బాధ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పార్టీ పటిష్టతకు దిశానిర్దేశం చేయడంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్ష చేస్తారు. రాష్ట్రంలో పది లోక్‌సభ సీట్లపై కన్నేసిన రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ప్రతిపాదిత అభ్యర్థుల పేర్ల జాబితాను ఖరారు చేసింది. 
 
 ఈ నేపథ్యంలో ఈ పదాధికారుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయానికి రాష్ట్రంలో పార్టీ బలాబలాలపై ఓ అంచనాకు వచ్చేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అంతోఇంతో బలం చూపగలిగిన స్థానాలు తెలంగాణలోనే ఎక్కువగా ఉండడంతో తెలంగాణ బిల్లు ఏ రూపంలో ఉన్నా మద్దతు ఇవ్వాలా? వద్దా? అనే విషయమై ఈ పదాధికారుల భేటీలో చర్చించవచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో సీమాంధ్రకు కావాల్సిందేమిటన్నదీ చర్చకు రావచ్చని భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి పర్యటన ముగిసిన వారంలోగానే మరో జాతీయ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఈనెల 28న మహబూబ్‌నగర్ సదస్సుకు రానున్నారు.
 
 వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే సీట్లు ఎంత కీలకం కానున్నాయో దీన్నిబట్టే అర్థమవుతోందని, తెలంగాణ నుంచి కనీసం ఐదు సీట్లు గెలిచేందుకు జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోందని ఓ సీనియర్ నేత తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల గుర్తింపు, గ్రామ శాఖల ఏర్పాటు, పోటీ చేసే అభ్యర్థుల నేపథ్యం, ఆర్థిక స్తోమత, పార్టీలో అంతర్గత విభేదాలు తదితర అంశాలపై రాజ్‌నాధ్ సింగ్ దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ నేతల పర్యటన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నేతలు జి.కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ తదితరులు ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర పదాధికారులతో చర్చలు జరిపారు. సుష్మా పర్యటన కోసం కిషన్‌రెడ్డి ఈనెల 22 నుంచి వారం పాటు మహబూబ్‌నగర్‌లో రథయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో సదస్సులు నిర్వహించి మరికొంతమంది జాతీయ నాయకుల్ని ఆహ్వానించనున్నారు. 
 
 త్వరలో సీమాంధ్రలోనూ సభలు...
 సీమాంధ్రలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు చల్లారిన తర్వాత అక్కడ కూడా సభలు నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేకాంధ్ర ఏర్పడితే ఒనగూరే ప్రయోజనాలేమిటో తెలియజేస్తూ సదస్సులు, బహిరంగసభలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లోగా మరోసారి రథయాత్ర నిర్వహించే యోచన ఉన్నట్టు తెలిపారు. 

Advertisement
Advertisement