అమ్మ ‘ఆశీర్వాదం’ దొరకదా? | Sakshi
Sakshi News home page

అమ్మ ‘ఆశీర్వాదం’ దొరకదా?

Published Thu, May 29 2014 4:15 AM

అమ్మ ‘ఆశీర్వాదం’ దొరకదా? - Sakshi

- తిరుచానూరు ఆలయంలో ఆశీర్వాదం సేవను పట్టించుకోని వైనం
- ఏడాదిగా ఐదు టికెట్లు మాత్రమే అమ్మకం
- బోసిపోతున్న ఆశీర్వాద మండపం
- పట్టించుకోని టీటీడీ అధికారులు

 
 తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానంలో ‘ఆశీర్వాదం సేవ’ భక్తులకు అందడం లేదు. ప్రముఖ దేవాలయాల్లో ఈ సేవకు భక్తుల నుంచి అత్యంత ఆదరణ లభిస్తుండగా ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమనే విమర్శలున్నాయి.
 
 సాక్షి, తిరుపతి: సుమారు ఏడాదిన్నర కిందట టీటీడీ అమ్మవారి దేవస్థానంలో ఆశీర్వాదం సేవను ప్రవేశపెట్టింది. ఈ సేవ టికెట్టును 500గా నిర్ణయించారు. సేవా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు వేదపండితుల ఆశీర్వచనం ఇచ్చేందుకు అమ్మవారి సన్నిధి సమీపంలో ప్రత్యేక మండపం ఏర్పాటుచేశారు. ఈ సేవ నిరాదరణకు గురికావడంతో మండపం బోసిపోతోంది.

 ఆశీర్వచనం టికెట్టు తీసుకున్నట్టయితే ఇద్దరు భక్తులకు వేదపండితులు ఆశీర్వాదం ఇస్తా రు. అమ్మవారి ప్రసాదాల్లో లడ్డూ, వడతోపాటు ఉత్తరీయం కూడా అందజేస్తారు. అమ్మవారి సన్నిధిలో ఆశీర్వచనం పొందడం భక్తులు పవిత్రంగా ను, స్వయంగా అమ్మవారు ఆశీర్వదించినంత అనుభూతి పొందుతుంటారు. ఇంతటి ప్రాధాన్యం కలి గిన సేవను విస్మరించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా భక్తులు విమర్శిస్తున్నారు.

ప్రచారం పూజ్యం
అధికారికంగా ఏడాదిన్నర కిందట సేవను ప్రారంభించినప్పటికీ పద్మావతి అమ్మవారి దేవస్థానం అధికారులు దాని గురించి ప్రచారం నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. దేవస్థానం ఆవరణలో గాని ప్రసార మాధ్యమాల ద్వారా గాని ప్రచారం నిర్వహించలేదు. దీంతో ఆశీర్వచనం సేవ ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు.

 సేవకు సంబంధించిన టికెట్టు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఏడాది కాలంగా ఆశీర్వచనం టికెట్లు కేవలం ఐదు మాత్రమే అమ్మకం జరిగాయని దేవస్థానం రికార్డులు చెబుతున్నాయి. దీన్నబట్టి ఈ సేవపట్ల అధికారుల్లో ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. అయితే దేవస్థానంలో వేదపండితుల కొరత ఒక కారణమని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆశీర్వచనం సేవ ప్రాచుర్యం పొందితే తమ ప్రాధాన్యం తగ్గి అధికారుల ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఉన్నందున వేదపండితులు అసంతృప్తితో ఉన్నట్టు పేర్కొంటున్నారు.

 ఏదిఏమైనా టీటీడీ సంకల్పించిన సేవ అధికారుల ఉదాశీనత కారణంగా భక్తులకు అందుబాటులో లేదనేది నిష్ఠుర సత్యం. ఈ విషయమై దేవస్థానం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి భాస్కర్‌రెడ్డి వివరణ ఇస్తూ ఆశీర్వచనం సేవకు ప్రచారం కల్పించడంలో కొంత వెనుకబడ్డామని చెప్పారు. టీటీడీ భక్తి చానల్‌లో ప్రచారం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరగలేదన్నారు. ఇకపై విస్తృతంగా ప్రచారం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

త్వరలో అభిషేకం టికెట్లకు బార్‌కోడింగ్
అమ్మవారి దేవస్థానంలో అభిషేకం టికెట్లను ఇకపై బార్‌కోడింగ్ విధానంలో అమ్మకాలు సాగించనున్నామని అధికారులు వెల్లడించారు. ఈ విధానం అమల్లోకి వస్తే టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత పెరగడంతో పాటు దుర్వినియోగానికి చెక్ పెట్టినట్టు అవుతుందని వివరించారు. ప్రస్తుతం దేవస్థానం ఆదాయం సగటున నెలకు *1.80 కోట్లు ఉండగా ఈ మొత్తాన్ని పెంచేం దుకు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement