పొట్ట విప్పి చూడ పాములొచ్చె! | Sakshi
Sakshi News home page

పొట్ట విప్పి చూడ పాములొచ్చె!

Published Tue, Jun 3 2014 6:37 PM

పొట్ట విప్పి చూడ పాములొచ్చె! - Sakshi

పూండి: పాములు గుడ్లు పెడతాయి.. వాటి నుంచి పిల్లలు వస్తాయి.. మనలో చాలామందికి ఈ విషయం తెలిసిందే.. కానీ, పాముల్లో రెండు రకాలు ఉంటాయని, శశూత్పత్తి చేసేవి కొన్నయితే.. అండోత్పత్తి చేసేవి మరికొన్నని అధిక శాతం మందికి తెలియని విషయం. ఈ విషయం తెలియకే పాము కడుపు నుంచి 50 పిల్లలు బయటకు రావడం శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పీవీపురం గ్రామస్తులను విస్మయానికి, గగుర్పాటుకు గురిచేసింది.

సోమవారం గ్రామంలోని బీసీ కాలనీలోని ఇళ్లలోకి ప్రవేశిస్తున్న ఒక పెద్ద పామును స్థానికులు గమనించారు. దాన్ని గునపంతో ఒళ్లంతా పొడిచి హతమార్చారు. గునపం పోట్లకు చీలిపోయిన పాము పొట్ట నుంచి ఒక్కసారి 50 పిల్లలు బయటకు వచ్చాయి. ఒక్కసారి అన్ని పాము పిల్లలను చూసి భయపడిన గ్రామస్తులు వాటిని కూడా చంపేశారు. కానీ.. పాము కడుపులోంచి పిల్లలు రావడమేమిటని ఆశ్చర్యానికి గురయ్యారు.

సమాచారం తెలుసుకున్న ‘న్యూస్‌లైన్’ ఈ విషయాన్ని తొగరాం ప్రభుత్వ జూనియర్ కళాశాల జంతు శాస్త్ర అధ్యాపకుడు పి.భాస్కరరావును సంప్రదించగా ఒక రకం పాములు పిల్లలను ప్రసవిస్తాయని ధ్రువీకరించారు. గ్రామస్తులు చంపేసిన పాము శరీరంపై డైమండ్ ఆకారంలో పెద్ద మచ్చలు ఉండటాన్ని బట్టి అది రక్తపింజర జాతి పాము అని తేల్చారు.

ఈ జాతి పాములు గుడ్లే పెడతాయని.. అయితే, వాటిని కడుపులో ఉండగానే పొదిగి పిల్లలను కడుపులోని సొన పొర రక్షణలో ఉంచుతాయని.. అనంతరం జననేంద్రియం ద్వారా ఆ పిల్లలను ప్రసవిస్తాయని వివరించారు. ఇలాంటి జీవులను కార్డేటా విభాగానికి చెందిన ‘ఓవివీపెరస్’ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారని ఆయన చెప్పారు. రక్తపింజరలు ఒక కాన్పులో 50 పిల్లలను కనడం కూడా సాధారణమేనని చెప్పారు.
 

Advertisement
Advertisement