పాలేటిలోపడవ బోల్తా | Sakshi
Sakshi News home page

పాలేటిలోపడవ బోల్తా

Published Tue, Jan 28 2014 3:14 AM

boat dipped in sea one child died

 టంగుటూరు, న్యూస్‌లైన్ : పాలేటిలో పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న ఎనిమిది మంది బాలురు నీట మునగగా వారిలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని అనంతవరం పంచాయతీ తాళ్లపాలెంలో ఆదివారం జరగగా సోమవారం వెలుగుచూసింది. టంగుటూరుకు చెందిన ఏడుగురు బాలురు సముద్రం చూసేందుకు తాళ్లపాలెం వెళ్లారు. సముద్రం వద్దకు తోడు రమ్మని వీరంతా తాళ్లపాలేనికి చెందిన బాలుడు నాయుడు గణేశ్(11)ను కోరారు. ఇందుకు అంగీకరించిన గణేశ్.. వారిని పాలేటి మీదుగా నీటిలో నడుచుకుంటూ సముద్రం వద్దకు తీసుకెళ్లాడు. సముద్రం చూసిన అనంతరం తిరిగి వచ్చే సరికి పాలేరు పోటుతో నిండుగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడే ఉన్న ఒక పడవలో వీరంతా ఎక్కారు. మార్గమధ్యంలో నీటి ప్రవాహానికి పడవ అటూ ఇటూ ఒరిగింది. భయంతో బాలురంతా చెల్లాచెదురుగా నీటిలో దూకారు. అందరిలో అరకొర ఈత వచ్చింది గణేశ్‌కే. నీట దూకిన వారంతా భయంతో గణేశ్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ కంగారులో అందరికంటే పొట్టిగా ఉన్న గణేశ్ నీట మునిగాడు. వీరి కేకలకు సమీపంలో రొయ్యల చెరువుల వద్ద ఉన్న వారు సంఘటన స్థలానికి పరుగున వచ్చారు. వెంటనే పిల్లలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీట మునిగిన గణేశ్ ఊపిరాడక కన్ను మూశాడు. వీరిని రక్షించడం కాస్త ఆలస్యమై ఉంటే పడవలో ఉన్న ఏడుగురూ ప్రాణాలతో మిగిలేవారు కాదని స్థానికులు చెప్పారు. కుమారుని మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో తాళ్లపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుని మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు జరిగాయి.

Advertisement
Advertisement