Sakshi News home page

వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?: బొత్స

Published Sun, Aug 6 2017 9:03 PM

వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?: బొత్స - Sakshi

కాకినాడ: నంద్యాలలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్ జగన్ మాట్లాడింది ధర్మమని, రాష్ట్ర ప్రజల ఆవేదననే ఆయన మాట్లాడారని.. అనవసరంగా ఈ విషయంపై టీడీపీ రాద్ధాంతం చేయడం సబబు కాదని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల్లో తన పబ్లిసిటీ కోసం 29 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నది సీఎం చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. పుష్కరాల ఘటనపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఏమైందో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తుని ఘటన రాష్ట్ర మంత్రి యనమల బంధువులు చేయించింది కాదా.. అలా కాని పక్షంలో ఘటన జరిగి ఏడాదైనా విచారణ నివేదికను ఎందుకు బయటపెట్టలేదో వెల్లడించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న శాంతియుత పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. కిర్లంపూడిలో ఇంటికో పోలీస్‌ను పెట్టి కాపులను గృహనిర్బంధం ఎందుకు చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు.

నిబంధనలకు నీళ్లొదిలిన చంద్రబాబు: ధర్మాన
కాకినాడ మున్సిపల్ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలకు పూర్తిగా నీళ్లొదిలారని మండిపడ్డారు. ఎన్నికలు ఆదరబాదరగా జరిపించడం వెనుక ఆంతర్యమేంటని ధర్మాన ప్రశ్నించారు. దీనిపై పౌరులు ప్రశ్నించడానికి వీల్లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కాకినాడ పౌరులు ఆలోచిస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేస్తుందని ధర్మాన తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement