బాలుడి కిడ్నాప్..హత్య | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్..హత్య

Published Fri, Sep 25 2015 1:12 AM

Boy Kidnapped

 తాళ్లరేవు : గాడిమొగ పంచాయతీ లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు మల్లాడి దుర్గ అలియాస్ పండు బుధవారం అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిన నేపథ్యంలో గురువారం పెదబొడ్డువెంకటాయపాలెం గ్రామకంఠం చెరువులో శవమై తేలడం సంచలనమైంది. కోరంగి పోలీసుల కథనం మేరకు ఏటా మహాలక్ష్మమ్మ జాతరను పెదబొడ్డు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తుంటారు. జాతరకు విద్యుత్ అలంకరణ పనిని లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన మల్లాడి నారాయణమూర్తి కుటుంబసభ్యులైన నలుగురు ఏటా చేస్తుంటారు.
 
 ఈ ఏడాది కూడా సుమారు రూ.3.5 లక్షలతో ప్రతిష్టాత్మకంగా విద్యుత్ అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మల్లాడి నారాయణమూర్తి, సోదరుడు సత్తిబాబులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా బుధవారం రాత్రి 10 గంటలకు సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమం జరుగుతుండగా నారాయణమూర్తి కుమారుడు దుర్గ ఏడుస్తుండడంతో అతడి తమ్ముడు మల్లాడి సత్తిబాబు కుమారుడికి అప్పగించారు. ఏదైనా కొనిపెడదామని పక్కనే జరుగుతున్న మహాలక్ష్మమ్మ జాతరకు తీసుకు వెళ్లాడని, ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తి దుర్గను ఎత్తుకు పోయినట్టు తెలిపారు. ఆ సమయంలో యువకుడు పెద్దగా కేకలు వేసినా సౌండ్ సిస్టమ్ కారణంగా వినిపించలేదు. దీంతో ఆ యువకుడు సత్కార కార్యక్రమం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పడంతో వారంతా బాలుడి కోసం వెతికారు. పలువురు యువకులు మోటార్ బైక్‌పై పరిసర గ్రామాల్లో గాలించారు.
 
 అయినా ఆచూకీ లభించకపోవడంతో వారు కోరంగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలించగా గురువారం రాత్రి పెదబొడ్డు వెంకటాయపాలెంలోని గ్రామకంఠం చెరువులో దుర్గ మృతదేహాన్ని కనుగొన్నారు. కాకినాడ రూరల్ సీఐ పవన్‌కిషోర్, ఏఎస్సై ఆర్‌వీఎన్ మూర్తి సంఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పెదబొడ్డు వెంకటాయపాలెం, లక్ష్మీపతిపురం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement