మాట తప్పిన అయ్యన్న | Sakshi
Sakshi News home page

మాట తప్పిన అయ్యన్న

Published Tue, Feb 10 2015 12:39 AM

మాట తప్పిన అయ్యన్న - Sakshi

నిరసనగా తరగతుల బహిష్కరణ
పాలిటెక్నిక్ విద్యార్థుల ఇంటిబాట
మంత్రి వస్తేనే కళాశాలకు వస్తామని స్పష్టీకరణ

 
తమ సమస్యలు పరిష్కరించాలంటూ నర్సీపట్నం పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ నెల 6న ఆందోళన చేపట్టారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొర పెట్టుకున్నారు. ఈమేరకు కళాశాలకు వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన కళాశాలకు వస్తారని, సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు. మంత్రి మాటతప్పడంతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఇంటి ముఖం పట్టారు. మంత్రి వస్తేనే కళాశాలకు మళ్లీ వస్తామని స్పష్టం చేశారు.
 
 నర్సీపట్నం: తమ సమస్యలు పరిష్కరించాలని  పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సోమవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఇంటి ముఖం పట్టారు.  తాగునీరు, మరుగు సౌకర్యం కల్పించాలని ఈ నెల 6న పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు మీద బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేశారు. అంతటితో ఆగకుండా ర్యాలీగా వెళ్లి మంత్రి అయ్యన్నపాత్రుడిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం మీ కళాశాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించిన విషయం తెలిసిందే.  మంత్రి అయ్యన్న సోమవారం తమ కళాశాలకు వస్తే సమస్యలు చెప్పుకుందామని విద్యార్థులు ఆశగా ఎదురు చూశారు. మంత్రి రాకపోవడంతో విద్యార్థులు బ్యాగ్‌లు సర్దుకుని ఇంటి బాట పట్టారు.పాడైన తాగునీటి కూలర్‌ను వినియోగంలో తీసుకురాకుండా, కూలర్ ప్రదేశంలో ట్యాప్‌లు ఏర్పాటు చేశారు. ట్యాప్‌లు ఏర్పాటు చేసినా తాగేందుకు నీరు పనికిరాదని విద్యార్థులు చెబుతున్నారు. మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించకుండా శుభ్రం మాత్రమే చేశారని. రన్నింగ్ వాటర్ లేకపోతే టాయిలెట్స్ ఎలా వినియోగించగలమని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.  కళాశాల ముందు పడి ఉన్న చెట్లు, చెత్తా చెదారాన్ని తొలగించారు  తప్ప సౌకర్యాలు మెరుగుపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ల్యాబ్‌లు, ప్రొజెక్టర్లు, అధ్యాపకుల కొరతతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని స్వయంగా మంత్రికి చూపిద్దామనుకున్నాం. విద్యా పరంగా నర్సీపట్నాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పదే పదే  చెప్పుకునే  అయ్యన్న  ఇలాకాలోని కళాశాలలో మౌలిక వసతులు లేకపోతే ఎలా చదవగలమని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.   700 మంది విద్యార్థులం వెళ్లి మొర పెట్టుకున్నప్పటికీ  మంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఎంత నచ్చచెప్పినా విద్యార్థులు వినలేదు. మంత్రి అయ్యన్న తమ కళాశాలకు ఎప్పుడు వస్తే అప్పుడే తాము వస్తామని విద్యార్థులు తరగతులు బహిష్కరించి వెళ్లిపోయారు.
 

Advertisement
Advertisement