బ్రేకింగ్ న్యూస్ | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్ న్యూస్

Published Wed, Aug 6 2014 12:32 AM

బ్రేకింగ్ న్యూస్ - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు మరమ్మతులకు నోచుకోని గుంటూరు చానల్ ఆధునికీకరణకు ప్రభుత్వం ఒక్కసారిగా రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నది. దాదాపు 45 సంవత్సరాల నుంచి కాలువకు ఎలాంటి మరమ్మతులు చేయని సాగునీటి శాఖ యుద్ధప్రాతిపదికన అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు అనేకసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోని ఇరిగేషన్ శాఖ ఆకస్మికంగా ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది.
 
 విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటైతే తాగునీటి సమస్య తలెత్తకూడదని, కాలువ ఆయకట్టు పరిధిలోని 27 వేల ఎకరాలకు సాగునీటి సమస్య లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఆధునికీకరణకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.1967లో ప్రారంభించిన ఈ చానల్ నిర్మాణం 1972లో పూర్తయింది.
 
 పాకలపాడు రెగ్యులేటర్ నుంచి వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదకాకాని, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు రూరల్, చేబ్రోలు మండలాల పరిధిలోని పంట పొలాలకు సాగునీటిని సరఫరా చేయడమే కాకుండా తాడేపల్లి, మంగళ గిరి, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరాకు ఈ కాలువను నిర్మించారు.
 
 నిర్మాణం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడాది పొడవునా కాలువకు నీటి సరఫరా జరుగుతుండటంతో మరమ్మతులకు అవకాశమే లేకుండా పోయింది. కాలువకు నీటి సరఫరా నిలిపి వేస్తే తాడేపల్లి, మంగళగిరితోపాటు గుంటూరు నగర ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వుంటుంది.
 
 కాలువ ఆయకట్టు పరిధిలో 32 సమ్మర్ స్టోరేజి ట్యాంకుల ద్వారా 27 గ్రామాలకు రక్షిత మంచి నీటి సరఫరా జరుగుతోంది. సాగునీటి సరఫరాకు ఆటంకంగా నిలిచిన తూడు, గుర్రపు డెక్క నిర్మూలనకు మాత్రమే అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు. నీటి సరఫరాకు నిర్మితమైన కట్టడాలు పూర్తిగాశిథిలమయ్యాయి. అంతేకాక, రూ.440 కోట్లతో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయడానికి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.
 
  కాలువను ఆధునీకరించినప్పుడే వీటిన్నింటికీ నీటి సరఫరా చేసే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు అంచనాలు తయారు చేశారు.నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం ఈ కాలువ ఆధునికీకరణకు రూ.122 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేయగా, కొత్త ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం రూ.300 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని ఇంజనీర్లు అంచనా చేశారు.
 
  47 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ కాలువకు సిమెంట్‌తో లైనింగ్ చేయడమే కాకుండా రిటైనింగ్ వాల్స్‌ను ఇరువైపులా నిర్మించనున్నారు. నల్లరేగడి నేలతో కూడిన కాలువ గట్లు తరచూ జారిపోయే ప్రమాదం ఉండటంతో రిటైనింగ్ వాల్స్ నిర్మించనున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే టెండర్ల స్వీకరణకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement