వంగ రైతు బెంగ! | Sakshi
Sakshi News home page

వంగ రైతు బెంగ!

Published Sat, Apr 26 2014 3:09 AM

వంగ రైతు బెంగ! - Sakshi

- పంటకు అంతుచిక్కని తెగుళ్లు
- ఈ ఏడాది అనుకూలించని వాతావరణం
- కోసిన కాయల్లో సింహభాగం పుచ్చులే..
- క్రిమిసంహారకాలు వాడినా ఫలితం శూన్యం
- సాగుకు సూచనలిచ్చే నాథులే లేరు
- జాడలేని ఉద్యానశాఖ అధికారులు
- కష్టానికి దక్కని ఫలితం..
- అప్పుల ఊబిలో రైతులు

 
 పిట్టలవానిపాలెం, న్యూస్‌లైన్ : తాజా కూరల్లో రాజా ఎవరంటే... ఠక్కున చెప్పే సమాధానం వంకాయ అని. గుత్తి వంకాయ పేరు వింటే నోరూరని వారుండరు.. ఆ కూర చూస్తేనే లొట్టలేస్తుంటాం.. ఆస్వాదిస్తూ తింటాం.. అంతటి రుచిగల వంగ.. సాగుచేసే రైతుకు మాత్రం కష్టనష్టాల్నే మిగుల్చుతోంది. గుత్తి వంకాయ రకం సాగుకు బాపట్ల ప్రాంతానికి రాష్ర్టంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఇక్కడ పండించే పంట బాపట్ల వంకాయగా పేరెన్నిక గన్నది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో తెగుళ్లు అధికమయ్యాయి. ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా తెగుళ్ల ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. రైతు కష్టానికి ఫలితం దక్కడం లేదు. దిగుబడిలో 90 శాతానికిపైగా పుచ్చులే కావడంతో రైతుకు నష్టాలే ఎదురవుతున్నాయి.

50 కిలోల బరువుండే టిక్కీ వంకాయల్లో 10 కిలోలకు మించి పుచ్చుల్లేనివి దొరకడం లేదంటే నష్ట తీవ్రత ఏమేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలోని గరువు నేలల్లో రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో వంగతోటలు విస్తారంగా సాగు చేస్తారు. వాతావరణంలో మార్పుల కారణంగా మొక్కలను ఆశిస్తున్న అంతుచిక్కని తెగుళ్లు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడి తోటల్లో ప్రధానంగా కొమ్మ తెగులు, వెర్రితల తెగులు, కాయపుచ్చు, చె ట్లు ఎండిపోవడంలాంటి తెగుళ్లు కనిపిస్తున్నాయి.  

కాయపుచ్చు విషయంలో ఎకరం తోటలో 20 టిక్కీల వంకాయలు తెగితే అందులో 10 కిలోలు కూడా మంచి కాయలు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అందిన చోటల్లా అప్పులు చేసి సాగుకు, పురుగుమందులు తదితరాల కోసం ఎకరానికి రూ.లక్షకు పైగా ఖర్చుచేశామని, కనీసం పెట్టుబడి కూడా దక్కక నష్టాలొస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.


 దుకాణదారుల సూచనలే.. తోటల్లో సస్యరక్షణ, ఎరువుల వాడకం, నీటి యాజమాన్యానికి సంబంధించి సలహాలు సూచనలు అందించాల్సిన ఉద్యాన శాఖాధికారులు  అసలు ఉన్నారో లే రో తెలియని పరిస్థితి. వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తే కూరగాయల సాగు తమకు సంబధించినది కాదని సమాధానమిస్తున్నారు.

దీంతో రైతులు చేసేది లేక తమ అనుభవం ఆధారంగా స్థానికంగా ఎరువులు, పురుగుమందుల దుకాణ దారులు ఇచ్చే సలహాల మేరకు క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ఈ విషయంపై పొన్నూరు ఉద్యానవన శాఖాధికారి డి.కల్యాణిని న్యూస్‌లైన్ వివరణ కోరగా వంగతోటలను పరిశీలించి అవసరమైన మేరకు సలహాలు, సూచనలు అందిస్తానని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement