విరిగిపడిన కొండచరియలు | Sakshi
Sakshi News home page

విరిగిపడిన కొండచరియలు

Published Sat, Apr 25 2015 2:37 AM

విరిగిపడిన కొండచరియలు - Sakshi

దుర్గగుడి టోల్‌గేట్ సమీపంలో ఘటన
భయభ్రాంతులైన వాహనచోదకులు

 
భవానీపురం : నగరంలో శుక్రవారం తెల్లవారుజామున వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీనికితోడు  దుర్గగుడి వద్ద కొండచరియలు విరిగిపడడంతో జనం ఉలిక్కిపడ్డారు. అయితే కొద్దిసేపు కురిసిన వర్షానికి కొండరాళ్లు పడలేదని, యాదృచ్ఛికంగానే పడ్డాయని పోలీసులు, దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుర్గగుడి టోల్‌గేట్ సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పెద్ద కొండరాయి ఉదయం 7 గంటల సమయంలో అకస్మాత్తుగా విరిగిపడింది.

సరిగ్గా ఆ సమయంలో నందిగామ నుంచి విజయవాడవైపు వస్తున్న కారు డోరుకు రాళ్లు తగిలాయి. కారులోపల ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఏమీ కాకపోవడంతో వారు ఊపిరి పీల్చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ట్రాఫిక్ ఏసీపీ ఎం.చిదానందరెడ్డి, భవానీపురం సీఐ గోపాలకృష్ణ, ఎస్‌ఐలు ప్రసాద్, రామకృష్ణుడు  సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం జేసీబీతో పడిపోయిన కొండరాళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు.  సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

ఐరన్ మెష్‌తో బారికేడింగ్ ఏర్పాటు చేస్తాం : ఈవో నరసింగరావు

విషయం తెలిసిన వెంటనే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో నరసింగరావు, ఈఈలు కోటేశ్వరరావు, మురళీబాలకృష్ణ, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నారు.  ఈవో మీడియాతో మాట్లాడుతూ కొండప్రాంతం లూజ్‌సాయిల్ కావడంతోపాటు పిండిరాళ్లు కావడంతో మామూలుగానే పడిపోయిందని చెప్పారు. ఘాట్ రోడ్‌లో కొండరాళ్లకు ఏర్పాటు చేసినట్లుగానే టోల్‌గేట్ నుంచి సుమారు 60 అడుగుల పొడవున (దేవస్థానం సరిహద్దు వరకు) ఐరన్ మెష్‌తోకూడిన డబుల్ బారికేడింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement
Advertisement