జన ధన యోజన పేరుతో తమ్ముళ్ల దందా | Sakshi
Sakshi News home page

జన ధన యోజన పేరుతో తమ్ముళ్ల దందా

Published Sun, Aug 31 2014 1:45 AM

జన ధన యోజన పేరుతో తమ్ముళ్ల దందా - Sakshi

  • ఖాతా తెరవాలంటే  రూ.50 నుంచి రూ.100 వసూలు  
  •   ఇదెక్కడి పద్ధతంటున్న  బాధితులు
  • గుడివాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జనధన యోజన’  తెలుగుతమ్ముళ్ల జేబులు నింపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికీ  నయాపైసా డిపాజిట్ లేకుండా ఖాతాలు తెరవాలని ఉన్న నిబంధనలను  తుంగలో తొక్కుతున్నారు. కొంతమంది ‘జనం’ దళారుల అవతారమెత్తి ‘ధనం’తో తమ జేబులు నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. తమను కాదంటే ఖాతా తెరవడం అసాధ్యమని చెప్పి బెదిరిస్తుండడంతో అమాయక జనం తప్పని పరిస్థితిలో డబ్బు చెల్లించి ఖాతాలు తెరుస్తున్నారు.
     
    రూ.50నుంచి 100 వసూలు !

    పట్ణణాల్లో ఉన్న బ్యాంకులు వార్డుల వారీగా ఖాతాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మురికివాడల్లో ఉన్న కొంతమంది నేతలు ఇది తమ పథకమేనని చెప్పుకుంటూ డబ్బు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా గుడివాడ పట్టణంలో దళితులు ఎక్కువగా ఉన్న వార్డుల్లో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ ఒక్కొక్కరి వద్దనుంచి రూ.100 వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన దగ్గరుండి ఖాతాలు తెరిపించే పనిలో ఉండడంతో ఇదెక్కడ గొడవరా బాబూ అంటూ జనం గొణుక్కుంటున్నారు.

    అలాగే అదే వార్డు సమీపంలో ఉన్న విజయా బ్యాంకు వారు రూ.50 చెల్లించాల్సిందేనని ముందు పట్టు బట్టారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు గొడవకు దిగడంతో  దిగొచ్చిన బ్యాంకు అధికారులు నాలిక్కరుచుకుని మీ డబ్బు మీ ఖాతాలో ఉంటుంది... అది మీకే కదా? ఇవ్వక పోయినా ఖాతాలు తెరుస్తామని చెప్పారు. అదే సమయానికి ‘సాక్షి’ అక్కడికి వెళ్లడంతో జీరో డిపాజిట్ అని ప్రకటించారు.

    ప్రజా ప్రతినిధులు ఈ పథకాన్ని సొమ్ము చేసుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందని డ్వాక్రా మహిళలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 9వ వార్డులో  అధికారపార్టీకి చెందిన ఓ నేత తన స్వచ్ఛంద సంస్థ ముసుగులో  సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఖాతా తెరిస్తే మీ అందరికీ లక్ష రూపాయల బీమా వస్తుందని, ఐదు నెలల తరువాత రూ.5వేలు ఉచితంగా మీ ఖాతాలో పడుతుందని చెప్పి  సొమ్ము వసూలు చేసే పనిలో పడ్డాడు.

    ఇది ప్రభుత్వ పథకమని తెలియని మురికివాడ ప్రజలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్దకు స్వయంగా వెళ్లకుండా నాయకుల్ని ఆశ్రయించడంతో పథకం లక్ష్యం నీరు గారిపోతోంది.  
     
    రూ.లక్ష బీమా ప్రమాదం జరిగితేనే...
     
    ప్రతి మనిషికీ ఖాతా తెరవడం వల్ల ఉచితంగా రూ.లక్ష బీమా వర్తిస్తుందని భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రమాదం జరిగినపుడేనని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. సహజంగా మరణిస్తే బీమా వర్తించదని చెబుతున్నారు. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అన్నీ నేరుగా లబ్ధిదారులకు వస్తాయని చెబుతున్నారని అంటున్నారు.    

    ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అంటే సామాన్యుడికి కేవలం సబ్సిడీ రూపంలో వచ్చే గ్యాస్, రేషన్ బియ్యం, పంచదార, కిరోసిన్ వంటివేనని తెలియజేస్తున్నారు. అంటే రేషన్ సరుకులు బదులు నగదు బదిలీకి బాటలు వేసేందుకు ఇది మార్గం కానుందని చెబుతున్నారు. వేలం వెర్రిగా ఖాతాలు తెరిపించి పేదల రేషన్ సరుకులు తీసేస్తారా? అనే ఆందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇదిలావుంటే బ్యాంకు అధికారులు స్పందించి వార్డుల్లో దళారులకు చోటివ్వకుండా జనధనయోజనను చిత్తశుధ్ధితో అమలు చేయాలని వారు కోరుతున్నారు.
     

Advertisement
Advertisement