భట్టి క్యాంప్ కార్యాలయంలో బుల్లెట్లు మాయం..? | Sakshi
Sakshi News home page

భట్టి క్యాంప్ కార్యాలయంలో బుల్లెట్లు మాయం..?

Published Mon, Nov 18 2013 8:38 AM

bullets missing in Deputy Speaker Mallu Bhatti Vikramarka camp office

ఖమ్మం :  రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో శనివారం రాత్రి 10 బుల్లెట్లు మాయమైనట్లు తెలిసింది. ఖమ్మంలోని భట్టి క్యాంప్ కార్యాలయంలో శనివారం విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సెలవుపై వెళ్తూ బుల్లెట్లు పక్కన ఉంచాడు. అనంతరం విధులకు హాజరైన కానిస్టేబుల్ బుల్లెట్లు లెక్క చూడగా 10 తక్కువగా ఉండడంతో అధికారులకు సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్న ఏఆర్ ఆర్‌ఐ శంకర్ ఆదివారం ఉదయం భట్టి క్యాంపు కార్యాలయానికి చేరుకుని విచారణ నిర్వహించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.
 
  బుల్లెట్లకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించినట్లు సమాచారం. ప్రతి రోజు భట్టి క్యాంపు కార్యాలయంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుంటారు. అయితే సిబ్బంది మాత్రం బుల్లెట్లు ఉన్నాయని చెబుతున్నప్పటికీ అధికారులు నిర్ధారించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపు కార్యాలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న ఏఆర్ సిబ్బంది వద్ద ఉండవలసిన బుల్లెట్లలో 10 బుల్లెట్లు మాయమై మూడు రోజులు గడుస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ఏఆర్ ఆర్‌ఐ శంకర్‌ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement