ఫోర్జరీ సంతకాలతో బురిడీ! | Sakshi
Sakshi News home page

ఫోర్జరీ సంతకాలతో బురిడీ!

Published Sat, Mar 1 2014 4:19 AM

Buridi forged signatures!

చిత్తూరు(సిటీ), న్యూస్‌లైన్ : సంఘంలోని సభ్యుల ప్రమేయం లేకుండా నగరంలోని ఓ బ్యాంకులో రుణం కింద ఏకంగా రూ. 5 లక్షల రూపాయలను నొక్కేసింది ఓ స్వయం సహాయక సంఘం గ్రూప్ లీడర్. ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసిన ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు రూరల్ మండలం గువ్వకల్లు దళితవాడకు చెందిన శశికళ, రిజిన, లలిత, కళ, శెల్వి, హంస కలిసి శ్రీ శారద మహిళ స్వయం సహాయక (డ్వాక్రా) సంఘం పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

గువ్వకల్లు పంచాయతీకి సంఘమిత్రగా వ్యవహరిస్తున్న శశికళను ఒకటో లీడర్‌గాను, కళను రెండో లీడర్‌గా ఎన్నుకుని ఆరేళ్ల పాటు  చిత్తూరు నగరంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఖాతా నంబర్ : 09300100012061 ద్వారా పొదుపు కార్యకలాపాలు సాగించారు. ఈ క్రమంలో 2008లో సంఘం సభ్యులు బ్యాంకు ద్వారా రుణాన్ని సైతం తీసుకుని క్రమం తప్పకుండా జమ చేసేవారు. అయితే సంఘానికి ఒకటో గ్రూప్ లీడర్ శశికళ బ్యాంకులో తీసుకున్న రుణాలను చెల్లించకుండా సంఘం డీఫాల్ట్ అయ్యేలా చేసింది.

తర్వాత సంఘంలో కొత్తగా చేరిన సభ్యులతో రుణాలు పొందాలని ఎత్తుగడ వేసింది. అందులో భాగంగా సంఘంలో తనకు అడ్డుగా ఉన్న శెల్వి, హంసల పేర్లను పనితీరు బాగాలేదనే సాకు చూపి తొలగించినట్టు చెప్పింది. అధికారికంగానే వారు సభ్యులుగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచి అదనంగా మరో నలుగురు సభ్యులను చేర్చుకుంది. పది మంది సభ్యులు ఉంటే రూ. ఐదు లక్షలు రుణం పొందే అవకాశం ఉండడంతో తన వ్యూహాన్ని పక్కాగా అమలుజేసింది. డీఫాల్ట్ అయిన సంఘాన్ని రీ యాక్టివేట్ చేసేందుకు కొత్త సభ్యుల పేరుతో గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన       రూ. 20 వేలు, అదే ఏడాది మార్చి 26వ తేదీన రూ.50వేలు, మే 17వ తేదీన మరో రూ. 76,003 చొప్పున లావాదేవీలను నిర్వహించింది. ఇలా బ్యాంకు అధికారులను నమ్మించింది.

పాత రుణం తాలూకు జమలు పెండింగ్‌లో ఉండగానే, సరికొత్త రుణం పొందేం దుకు ప్రణాళిక సిద్ధం చేసింది. సంఘం నుంచి తీసివేశామని చెప్పిన శెల్వి, హంసల పేర్లతో పాటు, సంఘంలోని పాత సభ్యులు నలుగురు, కొత్తగా నలుగురి పేర్లను కలిపి మొత్తం పది మంది ఉన్నామంటూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ. 5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు ఇచ్చిన అగ్రిమెంట్‌లో శెల్వి, హంసలతో పాటు, మరో నలుగురి సంతకాలను ఫోర్జరీ చేసింది. 2013 మే 18వ తేదీన రూ. 5లక్షలను బ్యాంకు లింకేజీ (వడ్డీలేని రుణం) కింద రుణంగా మంజూరు చేసింది.

ఈ మొత్తాల్లో ఒక్క పైసా కూడా గ్రూప్ సభ్యులకు చెల్లించకుండా గ్రూప్ లీడరే నొక్కేసింది. అనుమానం రావడంతో ఆ ఇద్దరు సభ్యులు ఈ నెల 21 వతేదీన బ్యాంకు అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను వివరణ కోరగా, 10 మంది సభ్యులు కలిసి రుణం తీసుకున్నట్లు తమ రికార్డుల్లో ఉందన్నారు. సంతకాలు ఫోర్జరీ అయినట్లు ధ్రువీకరణ అయితే  సభ్యులు, బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement