'బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే' | Sakshi
Sakshi News home page

'బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే'

Published Wed, Jan 7 2015 5:20 PM

'బస్సు ప్రమాదం తప్పు ప్రభుత్వానిదే' - Sakshi

అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదేనని విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంఘటన స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి, అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేసిన తప్పును డ్రైవర్ మీదకో.. మరెవరి మీదకో తోసేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో ప్రభుత్వం తప్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వానికి పిల్లల పట్ల కనీస మానవత్వం లేదనన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

''ప్రమాదం జరిగిన చోట ఎలాంటి బ్యారికేడ్లు లేవు. దానివల్లే 15 మంది పిల్లలు మరణించారు. మరింతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏ పాటి? ఈ పిల్లల పట్ల, వారి కుటుంబాల పట్ల చూపే మానవత్వం ఇదేనా? మళ్లీ ఇలాంటి తప్పులు జరగకూడదంటే కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ఆర్ అండ్ బీ ఇలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలంటే చనిపోయిన ప్రతి ఒక్కళ్ల కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తీవ్ర గాయాలపాలైన వాళ్లకు 5 లక్షల వంతున ఇవ్వాలి. తప్పు తమవల్లే జరిగిందని ప్రభుత్వం తెలుసుకుని, ఆ తప్పు తామే చేశామని ఒప్పుకొని, ఆ పిల్లలల కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరిమీదనో నెపం నెట్టడం మానుకుని. ఈ పిల్లల కుటుంబాలకు కనీసం 25 లక్షల పరిహారం ఇవ్వాలి''.

Advertisement
Advertisement