సీఐల బదిలీలకు బ్రేక్ | Sakshi
Sakshi News home page

సీఐల బదిలీలకు బ్రేక్

Published Sun, Dec 7 2014 3:31 AM

C.I transfers break

కర్నూలు : సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల వ్యవహారంలో తమ వారికి తగిన స్థానాలు దక్కలేదన్న కారణంతో తెలుగు తమ్ముళ్లు బదిలీలకు బ్రేక్ వేసినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం రాయలసీమ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణతో కలిసి బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే అందులో కొన్ని కీలక స్థానాలు తాము అనుకున్న వారికి దక్కలేదన్న కారణంతో తెలుగు తమ్ముళ్లు జోక్యం చేసుకుని రాష్ట్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలను నిలిపివేసినట్లు సమాచారం. జిల్లాలో ఇప్పటికే కొంతమంది విధుల్లో చేరిపోయారు. విధుల్లో చేరని వారు పాత స్థానాల్లోనే కొనసాగాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన నాయకులంతా కూడబలుక్కుని బదిలీలను నిలుపుదల చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. కర్నూలు రేంజ్ పరిధిలో 44 మంది సీఐలు బదిలీ కాగా అందులో సగం మంది బదిలీ నిలిచిపోయినట్లు సమాచారం.
 
  బనగానపల్లె, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు సర్కిళ్లకు నియమితులైన సీఐలు ఇప్పటికీ జాయిన్ కాలేదు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో విధుల్లో చేరిన వారి పరిస్థితి ఏంటని గందరగోళంగా మారింది. ఎన్నికల ముందు బయటి జిల్లాల నుంచి కర్నూలు జిల్లాకు వచ్చిన వారిని ఈ బదిలీల్లో సొంత జిల్లాలకు బదిలీ చేశారు. అయితే అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ప్రముఖ నాయకుడు ఈ బదిలీలకు అడ్డు చెప్పడంతో రాయలసీమ వ్యాప్తంగా నాలుగు జిల్లాలపై ఆ ప్రభావం పడింది. పత్తికొండలో పనిచేస్తున్న రియాజ్ అహ్మద్‌ను బదిలీల్లో భాగంగా సొంత నియోజకవర్గానికి వేయడం కూడా సమస్యాత్మకంగా మారింది. తిరుపతి ఈస్ట్‌లో పనిచేస్తున్న మురళీధర్‌రెడ్డిని సొంత నియోజకవర్గం రైల్వే కోడూరుకు వేయడం వివాదాస్పదంగా మారింది.
 
 దాంతో వారిద్దరి బదిలీలు కూడా ఆగిపోయినట్లు సమాచారం. కర్నూలులో మాజీ మంత్రులు శిల్పా మోహన్‌రెడ్డి, టీజీ వెంకటేష్ ముగ్గురేసి చొప్పున సిఫారసులు చేస్తే వారు సూచించిన పేర్లకు బదులుగా వేరేవాళ్లను నియమించడంతో పట్టుబట్టి ఆ స్టేషన్లను తమ వారికే కేటాయించాలంటూ శనివారం అధినేత వద్ద పంచాయితీ పెట్టినట్లు సమాచారం. అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా బదిలీలపై కినుక వహించినట్లు సమాచారం. మొత్తానికి జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ బదిలీలపై మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో గందరగోళం నెలకొని తాత్కాలికంగా బ్రేక్ పడింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement