‘టీ-నోట్’ రెడీ! | Sakshi
Sakshi News home page

‘టీ-నోట్’ రెడీ!

Published Mon, Sep 9 2013 12:40 AM

Cabinet note on Telangana awaiting political nod

* ‘తెలంగాణ’ ఏర్పాటుపై కేబినెట్ నోట్ సిద్ధం చేసిన కేంద్ర హోంశాఖ
* సోనియా ఆమోదం కోసం నిరీక్షణ
* మరో వారంలో అమెరికా నుంచి తిరిగిరానున్న కాంగ్రెస్ అధినేత్రి
* ఆమె రాజకీయ అనుమతి ఇచ్చాకే న్యాయశాఖకు నోట్
* అనంతరం కేబినెట్ ముందుకు.. తర్వాత జీఓఎం ఏర్పాటు
* మంత్రుల బృందం ఎజెండాకు ఈ కేబినెట్ నోటే ప్రాతిపదిక
* ‘సీమాంధ్రుల భద్రత’ అంశంపై దృష్టి కేంద్రీకరించిన నోట్
* హైదరాబాద్‌లో పదేళ్ల పాటు ఢిల్లీ తరహా పోలీసింగ్‌కు సూచన?
* ఉమ్మడి రాజధాని కాలంలో శాంతిభద్రతలు హోంశాఖ పరిధిలో!
* హైదరాబాద్ కమిషనరేట్ వరకేనా? లేక జీహెచ్‌ఎంసీ మొత్తమా? అనే అంశంపై మంత్రుల బృందానిదే నిర్ణయమంటూ పీటీఐ కథనం
* పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ లీకులంటున్న రాజకీయ విశ్లేషకులు
 
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్రహోంశాఖ కేబినెట్ నోట్ సిద్ధమయిందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన తర్వాత దానికి రాజకీయంగా ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర మంత్రివర్గానికి సమర్పిస్తామని ఆయన చెప్పినట్లు ‘పీటీఐ’ వార్తాసంస్థ తెలిపింది.

‘హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే నిర్దేశాల ప్రకారం.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అధికారులు కేబినెట్ నోట్‌ను రూపొందించారు. మేం నోట్‌తో సిద్ధంగా ఉన్నాం. దానికి రాజకీయ అనుమతి కోసం నిరీక్షిస్తున్నాం’ అని సదరు అధికారి వివరించినట్లు ఆ కథనంలో పేర్కొంది. సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం ఈ నెల 2వ తేదీన అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె వారం రోజుల్లో ఢిల్లీ తిరిగివస్తారని భావిస్తున్నారు.

తెలంగాణపై హోంశాఖ సిద్ధం చేసిన కేబినెట్ నోట్‌ను ఆమె పరిశీలించి రాజకీయంగా అనుమతి ఇచ్చిన తర్వాతే.. దానిని న్యాయశాఖకు పంపిస్తారు. ఆ తర్వాత ఈ నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళుతుంది. దీనిని పరిశీలించి తెలంగాణ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ విభజనపై తలెత్తే అంశాలను పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను) ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒక తీర్మానాన్ని పంపిస్తారు.
 
లీకులతో అయోమయం..
అయితే ఇదంతా కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘విభజన విషయంలో ఎలాంటి హోంవర్క్ చేయని కాంగ్రెస్.. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో.. ఇదిగో విభజించేస్తున్నామంటూ ప్రకటించేసింది. తీరా ప్రకటన చేశాక తలెత్తిన సమస్యలు చూసి.. తన గేమ్ ప్లాన్‌ను కొనసాగిస్తోంది. సీమాంధ్రకు చెందిన నేతలు వస్తే వారికి ఏదో ఒక భరోసా ఇచ్చి నచ్చజెప్పడం, తెలంగాణ ప్రాంత నేతలు వస్తే వారికి అనుకూలంగా మాట్లాడ్డం చేస్తోంది.

ఏదోవిధంగా పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ పెద్దలు అధికారికంగా ఒక మాట, అనధికారికంగా మరో మాట మాట్లాడుతున్నారు. తాము అనధికారికంగా చెప్పదలుచుకున్నఅంశాలను ఏదో ఒక వార్తా సంస్థ ద్వారా లీకులు ఇప్పిస్తున్నారు. వీటిలో ఏది వాస్తవమో.. ఏది అవాస్తవమో తెలియకుండా చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు’ అని ఢిల్లీలోని రాజకీయ విజ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు.

 కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి హైదరాబాద్ పోలీసింగ్?
 మంత్రుల బృందం ఎజెండాకు ప్రాతిపదిక కానున్న ఈ కేబినెట్ నోట్‌లో.. భద్రతపై సీమాంధ్ర ప్రజల ఆందోళనలపై దృష్టి పెట్టిందని.. అయితే అది పరిమిత స్థాయిలో మాత్రమే ఉండబోతోందని ఉన్నతస్థాయి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ‘హైదరాబాద్ ఒక్కటే వివాదాస్పద అంశం అయినందున.. ఆ నగరాన్ని పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయవచ్చని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ.. భద్రత విషయాల్లో సీమాంధ్ర ప్రజలను ఒప్పించటంలో ఇది విఫలమైనట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై నోట్‌లో దృష్టి కేంద్రీకరించాం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

‘ఉమ్మడి రాజధాని కాలం’లో హైదరాబాద్‌లో ఢిల్లీ తరహాలోనే శాంతిభద్రతల ఇన్‌చార్జ్‌గా గవర్నర్‌ను నియమించి, కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పోలీసింగ్ చేపట్టే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఈ నోట్ కేంద్ర కేబినెట్‌కు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) హోదా ప్రతిపాదనను సీమాంధ్రలోని కాంగ్రెస్ సొంత నాయకత్వంతో సహా పలు వర్గాలు వ్యతిరేకిస్తుండటంతో.. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పోలీసింగ్ నిర్వహించటం ఒక పరిష్కారం కాగలదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. హైదరాబాద్ కమిషనరేట్ వరకూ మాత్రమే ఈ ఏర్పాటు చేయాలా? లేక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధినంతటినీ చేర్చాలా? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో.. దీనిపై మంత్రుల బృందం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు.

అదేసమయంలో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ చుట్టుపక్కల.. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గల పలు మునిసిపాలిటీలు కూడా ఉండటం మరో వివాదానికి కారణమవుతోంది. కేంద్ర హోంశాఖ పోలీసింగ్ పరిధిలోకి జీహెచ్‌ఎంసీ మొత్తాన్నీ తీసుకువచ్చే ప్రతిపాదనను టీఆర్‌ఎస్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ ప్రాంతాన్ని కేంద్ర హోంశాఖ నియంత్రణలోకి తెచ్చే ప్రతిపాదనను టీఆర్‌ఎస్ నాయకత్వం వ్యతిరేకించటం లేదని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. కానీ.. సీమాంధ్ర ప్రజానీకంలో అత్యధికులు జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నందున.. టీఆర్‌ఎస్ ముందుకు తెచ్చిన ప్రతిపాదనను వారు అంగీకరించకపోవచ్చని కూడా ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement