రామనామం...ప్రత్యర్థులపై బాణం! | Sakshi
Sakshi News home page

రామనామం...ప్రత్యర్థులపై బాణం!

Published Sun, Dec 1 2013 3:48 AM

cadre not attend to renuka chaudhary's tour

సాక్షి, కొత్తగూడెం: ‘భద్రాచలం రాముడు తెలంగాణ దేవుడు.. ఈ ప్రాంతానికే రాములోరు దక్కేలా నినదించాలి’ అంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేపట్టిన భద్రాచలం జైత్రయాత్ర వెలవెలపోయింది. అనుంగు నేతలు ఆమె పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసినా చివరకు క్యాడర్ లేకపోవడంతో కార్యకర్తల సమావేశాలు కూడా రద్దయ్యాయి. ఊహించని రీతిలో క్యాడర్ దూరం కావడంతో సదరు నేతల అంచనాలు తలకిందులయ్యాయి. కాగా, పర్యటన యావత్తూ పార్టీలోని ప్రత్యర్థులపై విమర్శలకే రేణుక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
 ఇటీవలి కాలంలో తమ వర్గానికి షాక్ ఇచ్చేలా పార్టీలోని ప్రత్యర్థి వర్గం ఎత్తులు వేయడంతో నైరాశ్యంలో ఉన్న రేణుక అనుచర నేతలు జిల్లా పర్యటనకు రావాలని ఆమెను కోరినట్లు సమాచారం.

ఇదేసమయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా ఆమెను పక్కన పెట్టారు. మొత్తంగా తన అనుచరులలో ఉత్సాహం నింపాలన్న ఉద్దేశంతో రేణుక జిల్లా పర్యటన చేపట్టారు. దీంతో పాలేరు నుంచి భద్రాచలం వరకు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు పెట్టాలని ఆమె పర్యటనకు నాలుగు రోజుల ముందే ఆయా నేతలు షెడ్యూల్ ఖరారు చేశారు. ఊహించని రీతిలో రేణుక పర్యటనను సక్సెస్ చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని భావించారు. అయితే శనివారం నాటి జిల్లా పర్యటనలో... గతంలో ఆమె వెంట ఉన్న నేతలు మినహా మిగతా వారేవరూ రాకపోవడంతో ఆమె వర్గీయులు ఆశించిన స్థాయిలో జరగలేదు.

నాయకన్‌గూడెం నుంచి భద్రాచలం వరకు ఇదే పరిస్థితి. పార్టీ శ్రేణులు లేకపోవడంతో ఖమ్మం, వైరా, కొత్తగూడెం, ఖమ్మంరూరల్‌లో కార్యకర్తల సమావేశాలు రద్దు అయ్యాయి. దీంతో ఆమె కొణిజర్ల, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, కొత్తగూడెం, పాల్వంచసెంటర్లలో కాన్వాయ్ ఆపి అక్కడ ఉన్న కొద్దిమంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లాడలో గతంలో ఉన్న ఆమె అనుచర నేతల నుంచి కూడా స్పందన కూడా లేకపోవడం గమనార్హం. కొత్తగూడెం, పాల్వంచలో కొంతమంది క్యాడర్ కనిపించగా.. మిగతా చోట్ల అంతా పేలవంగానే ఆమె యాత్ర  సాగింది.
 ప్రత్యర్థులపైనే విమర్శనాస్త్రాలు..
 రేణుక పర్యటన అంతా పార్టీలో తనను ప్రశ్నిస్తున్న ప్రత్యర్థులను ఉద్దేశించిందిగానే సాగింది. ‘నేను సైనికుడిని బిడ్డను.. దేశంలో ఎక్కడైనా తిరుగుతా.. ఈ జిల్లాలో పుట్టినవారు జిల్లాకు ఏమైనా చేశారా..? నేను 27 ఏళ్లుగా జిల్లాకు రూ.కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేశాను. జిల్లా ఆడబిడ్డగా ఇలా అభివృద్ధి చేస్తుంటే.. నన్ను చేయనివ్వరు.. వాళ్లు చేయరు. వాళ్లు జిల్లాకు ఏంచేశారో..? నేను ఏంచేశానో బహిరంగ చర్చకు సిద్ధం’ అని ఆమె పరోక్షంగా మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆమె ప్రసంగించిన చోటల్లా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా  రాష్ట్ర విభజన ద్వారా తలెత్తే సమస్యలనూ సీఎం అధిష్టానానికి విన్నవిస్తున్నారని, ఆయన  ఫ్లెక్సీలు చించేవారు మూర్ఖులతో సమానం అంటూ  విమర్శించారు.
 అనుంగు నేతల హల్‌చల్..
 జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం మొదలు భద్రాచలం వరకు ఆమె అనుచర నేతల హల్‌చల్‌తోనే రేణుకాచౌదరి పర్యటన కొనసాగింది. ఖమ్మంలో ఉన్న కొద్దిమంది నేతలు నాయకన్‌గూడెం వెళ్లి స్వాగతం పలకడంతో పాటు అక్కడి నుంచి భద్రాచలం వరకు ఆమె పర్యటనలో కొనసాగారు. పాలేరులో కొంత సేపు ఆగగా.. అక్కడి సర్పంచ్ మాధవిరెడ్డి తన వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా పాలేరు నియోజకవర్గంలో కుంపటి పెట్టాలని ఆమె వ్యూహంలో ఉన్నట్లు పార్టీవారే చర్చించుకున్నారు. 

క్యాడర్ లేక కార్యకర్తల సమావేశాలు రద్దు కావడం, అసలు పర్యటన ఫలితం ఏముంటుందని భావించే రేణుకాచౌదరి.. ‘భద్రాచలం జైత్రయాత్ర’ అని ఆమె పర్యటనకు పేరుపెట్టుకున్నట్లు పార్టీలోని నేతలు చర్చించుకుంటున్నారు. పలువురు ముఖ్యనేతలు, వారి వర్గం వారు రేణుక పర్యటనకు దూరంగా ఉన్నారు. కాగా, తెలంగాణవాదులు, ఆమె ప్రత్యర్థి వర్గం అనుచరులు ఎవరైనా ఆమె పర్యటనను అడ్డుకుంటారేమోనని పోలీసులు మాత్రం భారీ బందోబస్తు చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement