పేదల ఆక్రమణలో కాల్వ గట్లు | Sakshi
Sakshi News home page

పేదల ఆక్రమణలో కాల్వ గట్లు

Published Fri, Apr 15 2016 1:27 AM

పేదల ఆక్రమణలో కాల్వ గట్లు - Sakshi

సీఎం చంద్రబాబు వెల్లడి

 

విజయవాడ : విజయవాడలో కాల్వ గట్లను పేదలు ఆక్రమించుకున్నారని, అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారని, ఆ నీటినే కింది ప్రాంతాల ప్రజలు తాగాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో అంబేద్కర్ జయంత్యుత్సవాలు, జక్కంపూడిలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. విజయవాడ సిటీ ఆఫ్ కెనాల్‌గా పేరుపొందాల్సిందని, విజయవాడలో ఇళ్లు పెద్ద సమస్యగా మారడంతో పేదలు కాల్వగట్లను ఆక్రమించుకున్నారని అభిప్రాయపడ్డారు. అందువల్లనే జక్కంపూడిలో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. లక్షమంది పేదల్ని ఇక్కడకు తరలించి, విజయవాడను సిటీ ఆఫ్ కెనాల్స్‌గా తీర్చిదిద్దుతామన్నారు. జక్కంపూడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. జక్కంపూడిలో నూతనంగా నిర్మిస్తున్న గృహసముదాయం పైలాన్‌లో తమ పేర్లు లేకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు చిన్నబుచ్చుకున్నారు.
 

విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. 125 ఏళ్ల కింద పుట్టిన అంబేద్కర్ తాను చేసిన పనులతో ఇప్పటికీ గుర్తుండేలా అందరి మదిలో నిలిచిపోయారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ఎస్సీలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో 15 మంది దళిత ప్రముఖులకు దళిత రత్న అవార్డులు ఇచ్చారు. ఇందులో 11 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే కావడం గమనార్హం.

 
ఎమ్మార్పీస్ నేతలపై నిఘా...

బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సభ వద్దకు కొంతమంది ఎమ్మార్పీఎస్ నేతలు వచ్చి నిరసన తెలియచేసిన నేపథ్యంలో జక్కంపూడిలో అటువంటి ఘటన జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో ఉన్న ఎమ్మార్పీఎస్ నేతలపై నిఘా పెట్టారు.

 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement