చంద్రబాబు రాజీనామా చేయాలి | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజీనామా చేయాలి

Published Tue, Jun 9 2015 2:01 AM

చంద్రబాబు రాజీనామా చేయాలి - Sakshi

* వైఎస్సార్‌సీపీ డిమాండ్
* నేడు నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ మాట్లాడిన టెలిఫోన్ సంభాషణ బట్టబయలైన నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌పై మంగళవారం (9 వ తేదీన) అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వీ.మైసూరారెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కె.పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అత్తారు చాంద్‌బాషలతో కలసి విలేకరులతో మాట్లాడారు. అనైతిక చర్యలకు పాల్పడిన చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై ధర్నాలకు పిలుపునిచ్చినట్టు మైసూరారెడ్డి చెప్పారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ధర్నాలు జరుగుతాయన్నారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అవినీతిని ప్రోత్సహించడం అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తుందని, ఆయన ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేనే లేదని మైసూరా చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో తన పాత్ర ఏమిటో విచారణ కోరి నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఆ అంశాన్ని మొత్తం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా మార్చి పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇదెంత మాత్రం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్య కాదని, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సమస్య అని ఆయన స్పష్టం చేశారు.
 
విచారణ కోరండి: పార్థసారథి
తాను నిప్పులాంటి మనిషినని పదే పదే చెప్పుకొనే చంద్రబాబు.. ఓటుకు నోటు వ్యవహారంలో ధైర్యంగా విచారణ జరిపించుకోవాలే తప్ప సాకులు వెద కడం సరికాదని పార్థసారథి అన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడనేలేదని కొందరు, అసలు ముఖ్యమంత్రి ఫోన్‌ను ఎలా ట్యాప్ చేస్తారని ఇంకొందరు, అక్కడక్కడా మాట్లాడింది చేర్చి టేపులు తయారు చేశారని మరి కొందరు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి చంద్రబాబు స్వయంగా ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలను సారథి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోతే ఇతరులపై నిందలు వేయడం చూస్తుంటే, దొంగే...దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉందని ఆయన అన్నారు.
 
చంద్రబాబును అరెస్టు చేయాలి: నల్లా
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై కేసు పెట్టి తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరాలని సూర్యప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.
 
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

తెలంగాణ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభపెట్టే ఆడియో టేపులు బట్టబయలైనందున ఆయన పదవి నుంచి తప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా డిమండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు.  తిరుపతి రూరల్ మండలం మల్లంగుంట సర్కిల్‌లోని జాతీయ రహదారిపై అవినీతి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. విశాఖ జిల్లాలో ఆందోళన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement