ఏఎంసీ కార్యదర్శిపై సీబీ‘ఐ’ | Sakshi
Sakshi News home page

ఏఎంసీ కార్యదర్శిపై సీబీ‘ఐ’

Published Wed, Jul 22 2015 1:56 AM

CBI investigation into irregularities in Officers purchase of cotton

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :పత్తి కొనుగోళ్లలో అక్రమాలపై సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చింతలపూడి మార్కెట్  
 యార్డు పరిధిలో ఈ ఏడాది మొదట్లో పత్తి విక్రయాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇన్‌చార్జి టీటీఎస్‌వీవీ నారాయణ ఇంటిపై మంగళవారం ఉదయం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోని ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పత్తి కొనుగోళ్ల పత్రాలను స్వాధీనం చేసుకుని ఆయన్ను విచారించినట్టు తెలిసింది. ఈ ఏడాది  తొలినాళ్లలో పత్తి దిగుబడులకు గిట్టుబాటు ధర రాలేదు. దీంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలను తెరిచింది. క్వింటాల్ పత్తికి రూ.4,500 వరకు గిట్టుబాటు ధర ప్రకటించింది.
 
 చింతలపూడి  మార్కెట్ యార్డు అధికారులు, సీసీఐ సిబ్బంది, దళారులు కుమ్మక్కై తక్కువ ధరకే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.3,600 చొప్పున మాత్రమే చెల్లించి ఎక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించారు. పత్తిని యార్డుకు తీసుకురాకుండా నేరుగా వ్యాపారులకే విక్రయించేలా రైతుల్ని ప్రోత్సహించారు. రశీదుల్లో మాత్రం గిట్టుబాటు ధర చెల్లించనట్టు, విక్రయాలన్నీ దాదాపుగా యార్డులోనే జరిగినట్టు లెక్కలు తారుమారు చేశారు. కుకునూరు మార్కెట్ యార్డు కూడా చింతలపూడి పరిధిలోకి రాగా, పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు  రైతుల నుంచి అందిన ఫిర్యాదులపై రంగంలోకి దిగిన సీబీఐ.. మార్కెట్ యార్డు సూపర్‌వైజర్లతో పాటు సీసీఐ బయ్యర్ల ఇళ్లను కూడా తనిఖీ చేసింది. ఆ క్రమంలోనే మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇన్‌చార్జి నారాయణ ఇంటిపై దాడులు చేసినట్టు తెలుస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement