సంబురాల తెలంగాణ | Sakshi
Sakshi News home page

సంబురాల తెలంగాణ

Published Wed, Feb 19 2014 1:13 AM

సంబురాల తెలంగాణ - Sakshi

 టీ-బిల్లు ఆమోదంతో ఆనందోత్సాహాలు
 ఉప్పొంగిన ఉత్సాహంతో నృత్యాలు చేసిన జనం
 పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లో వేడుకలు
 బాణసంచా పేల్చుతూ, మిఠాయిలు పంచుకున్న తెలంగాణవాదులు

 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజలంతా తెలంగాణ జెండాలు చేబూని స్వరాష్ట్ర ఏర్పాటును స్వాగ తించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని జెతైలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఆనందంతో నృత్యాలు చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎల్‌డీ, ఎంఎస్‌పీ, వివిధ ఉద్యోగ, న్యాయవాద, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, టీఎన్‌ఎస్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. కళాకారుల ఆటాపాటలతో కుంకమలు చల్లుకొని ఆనందాన్ని పంచుకున్నారు.   అమరవీరుల స్తూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద అమరులకు నివాళులు అర్పించారు. పలుచోట్ల పాలాభి షేకం చేశారు.
 
 సాక్షి, నెట్‌వర్క్:  తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడంతో... ఆ ప్రాం తంలో సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీల నేతలు, కార్యకర్తలు వేడుకల్లో మునిగితేలగా, సచివాలయం లో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నా రు.  తెలంగాణ భవన్‌లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు బాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.   హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జిలు తమ అనుచరులతో ర్యాలీలుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. నృత్యం చేస్తూ, రంగులు చల్లుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వేడుక నిర్వహించారు. పీసీసీ మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత నేతృత్వంలో పలువురు నేతలు, కార్యకర్తలు సోనియాగాంధీ చిత్రపటం చేతబూని డప్పు శబ్దాల మధ్య నృత్యాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. కాగా.. తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వ్యక్తిగత కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయానికి వచ్చి స్వీట్లు పంచడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రాజేశ్వరరావు, ఎస్.కుమార్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, అశోక్‌కుమార్ యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుని గులాం చల్లుకున్నారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా పేల్చారు. నృత్యాలతో హోరెత్తించారు.
 
   సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు నేతృత్వంలో రంగులు చల్లుకుంటూ జై తెలంగాణ నినాదాలతో సచివాలయం మొత్తం కలియదిరిగారు. రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తరువాత పూర్తిస్థాయిలో సంబురాలు చేసుకుంటామని నరేందర్‌రావు పేర్కొన్నారు.  వరంగల్ జిల్లా హన్మకొండలో కాకతీయ యూనివర్సీటీ విద్యార్థి జేఏసీ, అధ్యాపకులు, సిబ్బంది కేరింతలు కొడుతూ, నృత్యాలు చేశారు.  జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, తొర్రూరు, పాలకుర్తి, మరిపెడ సెంటర్‌లలో తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరి ఆనందోత్సాహంతో ఆలింగనాలు చేసుకున్నారు. హన్మకొండ ఏకశిలా పార్కు వరకు తెలంగాణవాదులు ర్యాలీగా వచ్చి అక్కడున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్ ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.  ఆదిలాబాద్ తెలంగాణచౌక్‌లో రహదారిపై టపాసులు కాల్చి, నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుని మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. కలెక్టరేట్ ఉద్యోగులు మిఠాయిలు పంచుకున్నారు. కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఊట్నూర్, భైంసాలో ర్యాలీలు జరిగాయి. సింగరేణి బొగ్గు గనులపై కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు. కరీంనగర్‌లో వివిధ ప్రజాసంఘాలు,  విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. నిజామాబాద్‌లో టీజేఎసీ ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు రోడ్లపైకి చేరి జయజయధ్వానాలు చేశారు.  
 
 కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలలోనూ ఘనంగా సంబురాలు జరిగాయి. ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, కుల సంఘాలు, మైనార్టీలు, కార్మికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు ఇందుకు వేదికలయ్యాయి. మోటారుసైకిళ్ల ప్రదర్శనలు, బాణాసంచా పేలుళ్లు, స్వీట్లు పంచుకోవడం, విగ్రహాలకు అభిషేకాలతో జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంబరం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరులస్థూపం జెతైలంగాణ నినాదాలతో హోరెత్తింది. ఉపాధ్యాయ, విద్యార్థి, ఉద్యోగసంఘాలు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పలువురు తెలంగాణవాదులు పాలాభిషేకం చేశారు. పాలమూరు జిల్లాలో మంగళవారం అన్ని పట్టణాలు, గ్రామాల్లో సంబురాలు జరుపుకొన్నారు. రాజకీయ పక్షాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఎవరికి వారుగా ర్యాలీలతో ముఖ్య కూడళ్లకు తరలివచ్చారు. బాణసంచా పేల్చుతూ ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. డప్పు చప్పుళ్లతో ముఖ్య కూడళ్లు మార్మోగాయి.
 
 మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.  మెదక్  జిల్లాలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీల నాయకులు భారీఎత్తున టపాసులు కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచుతూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో అమరవీరుల స్థూపానికి క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా తెలంగాణ వాదులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చడంతోపాటు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు నుంచి గన్‌పార్క్‌కు ప్రదర్శనగా వెళ్లి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.  
 
 అమరుల ఆశయం నెరవేరింది
 
 తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో  తెలంగాణ మలిఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారితోపాటు వెయ్యి మంది అమరవీరుల ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న వేళ శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులుగా ఎంతో సంతృప్తి చెందుతున్నాం. మలి ఉద్యమానికి మా కొడుకు త్యాగం ఎంతో  స్ఫూర్తినిచ్చింది. లక్ష బాధలు పడి తెలంగాణ లక్ష్యాన్ని కేసీఆర్ సాధించారు. రాష్ట్ర సాధనకోసం లెక్కలేని అభాండాలు, అపనిందలు తనపై మోపినా కేసీఆర్ భరించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇప్పటికైనా సీమాంధ్రులు ఉద్యమాన్ని విరమించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్‌లో కలిసిమెలిసి  బతకవచ్చు.
     - శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులు శంకరమ్మ-వెంకటాచారి
 
 అమరుల త్యాగఫలితం
 
 ‘తెలంగాణ కోసం నా భర్త (కానిస్టేబుల్ కిష్టయ్య) తన జీవితాన్నే త్యాగం చేశారు. ఆయన లేకపోవడం మాకు ఎంతో నష్టం.  ఆ బాధ ఉన్నా రాష్ట్రం రావడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఆయనతోపాటు ఎందరో అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఆయన స్వప్నం నెరవేరడం సంతోషం. సోనియమ్మకు కృతజ్ఞతలు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’
     - కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మ
 
 25 నుంచి విజయోత్సవాలు: ఓయూ జేఏసీ
 
 హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరు దశబ్దాల ఉద్యమ ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను విద్యార్థి అమరులకు అంకితమిస్తున్నామని ఉస్మానియాయూనివర్సిటీ (ఓయూ)లోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత రాజు మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి తెలంగాణ పది జిల్లాల్లో విజయోత్సవ ర్యాలీలను, మార్చి 5న ఓయూ ఆర్ట్స్ కళాశాలలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో 30 మంది యువకులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు బీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వీరబాబు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం, ఏబీవీపీ, బీజేవైఎం, టీఆర్‌ఎస్వీ, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement