ఇందూరు గర్జించింది | Sakshi
Sakshi News home page

ఇందూరు గర్జించింది

Published Sat, Feb 22 2014 3:00 AM

celebrations of telangana in induri

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం చరిత్రలో మరచిపోలేని ఘట్టం. ఇందులో ఇందూరు జిల్లా పాత్ర మరువలేనిది. ప్రత్యేక రాష్ట్రం కోసం జిల్లాలోనూ ఉవ్వెత్తున ఉద్యమం సాగింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు.. అందరూ పోరుబాటలో నడిచారు. అలుపెరుగకుండా నిరంతరాయంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కళాకారులు ధూం ధాం చేశారు. జిల్లా ప్రజల గొంతుకయ్యారు. కవులు, రచయితలు తమ కలంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.

 అందరూ కీలకమే..
 ఉద్యమంలో ప్రధాన పార్టీలు భాగమయ్యాయి. టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ కోసం కలిసికట్టుగా.. ఎవరికి వారే ఆందోళనలు చేశారు. సభలు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కుల, విద్యార్థి, న్యాయవాద, డాక్ట ర్స్ తదితర జేఏసీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఆందోళనకు నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా ప్రధాన కేంద్రం కాగా... జిల్లా వ్యాప్తం గా చాలా పట్టణాల్లో ధర్నా కేంద్రాలు తెలంగాణ చౌక్‌లుగా మారాయి.

 ఉద్యోగుల పాత్ర
 2009లో టీఎన్జీఓలు 42 రోజులపాలు సమ్మెలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను చాటారు. గ్రామాల్లో పర్యటించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. 15రోజుల పాటు సహాయ నిరాకరణ ఉ ద్యమాన్ని నడిపారు. కేసీఆర్ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు పది రోజుల పాటు పెన్‌డౌన్ చేశారు. ప్రతిరో జూ జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు సాగాయి. ప్రభుత్వ హెచ్చరికలనూ బేఖాతరు చేశారు. ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి ఆందోళనలు కొనసాగించారు.

 కానిస్టేబుల్ కిష్టయ్యనుంచి..
 ప్రత్యేక రాష్ర్టం కోసం జిల్లాకు చెందిన 72 మంది ఆత్మబలిదానం చేశారు. 2009 నవంబర్‌లో కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు పూనుకోవడం, దానిని ప్రభుత్వం అడ్డుకోవడంతో ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఆందోళనలతో జిల్లాను అట్టుడికించారు. తెలంగాణ రాదేమోనని భావించిన పలువురు బలిదానాలకు పాల్పడ్డారు. కామారెడ్డిలో కానిస్టేబుల్ కిష్టయ్య టవర్ ఎక్కి రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. ఉద్యమానికి ఊపిరులూదాడు. 2009 డిసెంబర్ 7న లింగయ్య, 12న కాశయ్య, 29న బత్తుల రాజు.. ఇలా అనేక మంది తెలంగాణ కోసం ఆత్మార్పణం చేశారు. ఆలస్యంగానైనా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పచ్చజెండా ఊపడం, పార్లమెంట్ దానిని ఆమోదించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం అమరత్వం పొందిన వీరుల ఆత్మబలిదానాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

 పోరుబాటలో ఉద్యమ పార్టీ
 మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పాత్ర కీలకమైనది. తెలంగాణ ఆకాంక్షతో 2001లో ఆవిర్భవించిన ఈ పార్టీని ఇందూరు జిల్లా వాసులు ఆదరించారు. ప్రజలు కేసీఆర్‌కు బాసటగా నిలిచారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థి శక్తులు ఉద్యమంలో పాల్గొనడంతో టీఆర్‌ఎస్ మరింత బలపడింది. 2002లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. కాంగ్రెస్ సహకారంతో జిల్లా పరిషత్‌ను కైవసం చేసుకుంది. 2004లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైంది. తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించింది.

Advertisement
Advertisement