కరువు అంచనా...అంతా వంచన | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 19 2018 8:19 AM

Central Famine Observation  Team For Rabi Season - Sakshi

కరువు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం వస్తుందని రైతులు, కూలీలు సంతోషించారు. తమ కష్టాలు విని ఉపశమనం కలిగిస్తారని భావించారు. తీరా వచ్చాక కనీసం ఒకచోట పది నిమిషాలు కూడా గడపలేదు. రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు, కష్టాలు వారికి తెలుపుకుందామని వారి వద్దకు వెళ్లగా చివరకు నిరాశే మిగిలింది. తూతూమంత్రంగా వారితో మాట్లాడారు. కనీసం వివరాలు కూడా నమోదు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో కరువు బృందం పరిశీలన తమకు ఎంతమేర ఉపశమనం కలిగిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

బద్వేలు : రబీ సీజనుకు సంబంధించి కేంద్ర కరువు పరిశీలన బృందం బుధవారం కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు, ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పంటనష్టం, తాగునీటి సరఫరా, ఉపాధి పనుల తీరు తదితరాలను పరిశీలించారు. ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్‌ బీకే శ్రీవాత్సవ, ఎఫ్‌సీడీ ఫైనాన్స్‌ డిప్యూటీ డైరెక్టరు ముఖేష్‌కుమార్, అగ్రి ఇన్‌పుట్స్‌ పరిశోధనాధికారి అనురాధ బటానా, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ డీజీఎం విజయకుమార్‌ ఉన్నారు.

ఒకరోజు పరిధిలో రెండు మండలాల్లో ఆరు ప్రాంతాల్లో కరువు బృందం పర్యటన ఏర్పాటు చేయడంలోనే అధికారుల చిత్తశుద్ధిలోపం కనిపిస్తోంది. గుంతలతో కూడిన మట్టి రోడ్లపై దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించడం, నాలుగు ప్రాంతాల్లో రైతులు, కూలీలతో ముఖాముఖి, మూడు ప్రాంతాల్లో చెరువుల పరిశీలన ఎలా సాధ్యమనే విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఒక రోజు వ్యవధిలో వీటన్నింటిని పూర్తి చేసుకుని తూతూమంత్రంగా తమ పర్యటనను ముగించారు.
ఉపాధి కష్టాలకు గంతలు
కరువు పరిశీలన బృందం మొదట సావిశెట్టిపల్లె సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడ కొండవాలున తవ్విన కందకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా అధికారులు కూలీలతో పనులు బాగున్నాయని, కూలీ నగదు అందుతున్న రీతిలో చెప్పించారు. దీంతో పాటు పని వద్ద నీడ ఏర్పాట్లు, మజ్జిగ అందజేత, మెడికల్‌ కిట్లు అందించామని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందరోజులు పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ దాదాపు వందమంది కూలీలు ఉండగా వారిలో కేవలం నలుగురో ఐదుగురో వంద రోజులు పనిచేశారు. కేవలం వీరిని మాత్రమే అధికారులతో మాట్లాడించారు. మెడికల్‌ కిట్లు అందజేసి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఏడాది నీడ కోసం టెంట్లు అందించలేదు. అలాగే ఎండలకు నీటి వసతి, మజ్జిగ సౌకర్యం కల్పించలేదు. కానీ ఇవన్ని కూలీలు చెప్పకుండా కేవలం పనులు బాగున్నట్లు మాత్రమే చెప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నెలల తరబడి ఉపాధి వేతనం రాకున్నా ఆ సమస్యను మాత్రం కేంద్రం బృందం దృష్టికి మాత్రం తీసుకురాలేదు. 
చెరువుల పరిశీలన
అంతకుమునుపు ఇటుకలపాడు చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు, నీటి ఒరవ, పంటల సాగు వంటి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాలాయపల్లెలో కూడా చెరువును పరిశీలించారు. చెరువు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా చాలావరకు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించలేదు. చెరువుకు ఒరవ తక్కువగా ఉందని. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటుకలపాడు, బాలాయపల్లె చెరువులకు తెలుగుగంగ ఎడమ కాలువ నుంచి ఎత్తిపొతల పథకం ఏర్పాటు చేసి నీటిని అందించాలని విన్నవించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం, జేడీఏ ఠాకూర్‌నాయక్,  ఏడీ క్రిష్ణమూర్తి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సంజీవరావు, డీడీ మురళి, వెటర్నరీ ఏడీ డాక్టరు రెడ్డమ్మ, కాశినాయన తహసీల్దార్‌ మల్లికార్జున, పోరుమామిళ్ల తహసీల్దార్‌ సీసీఎస్‌ వర్మ, ఎంపీడీఓలు ఆయూబ్, రామక్రిష్ణయ్య, ఆర్‌ఐలు మోహనరాజు, దక్షిణమూర్తి, ఎఓలు రామాంజనేయరెడ్డి, షరీఫ్‌ పాల్గొన్నారు.

రైతులకు గోడు వినకుండానే..
అనంతరం కాశినాయన మండలంలోని చిన్నాయపల్లెలో శెనగ రైతులతో కరువు బృందం సమావేశమైంది. కానీ ఇక్కడ కూడా ఇద్దరు రైతుల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదు. వ్యవసాయాధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వలేదు. మండలంలోని అధికశాతం మంది రైతులు నష్టపోయినా రైతుల సంఖ్య తక్కువ చేసి చూపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు చెప్పిన విషయాన్ని నమోదు చేసే సమయం కూడా అధికారులకు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు తాము వేసిన పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, కలిగిన నష్టం వివరాలను తెలుపుదామని ఎదురుచూసినా వారికి అవకాశం లభించలేదు. సాయంత్రం మూడు గంటలకు బాలాయపల్లెలో జొన్న రైతులతో సమావేశమయ్యారు. ఇద్దరు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రైతులు తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అలాగే గ్రామంలోని పలువురు తాగునీటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఇక్కడ పది నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయించారు.

   

1/1

ఉపాధిహామీ కూలీల నుంచి వివరాలు తెలుసుకుంటున్న కరువు బృందం అధికారులు

Advertisement
Advertisement