టార్చిలైటు వెలుగులో నష్టాల పరిశీలన! | Sakshi
Sakshi News home page

టార్చిలైటు వెలుగులో నష్టాల పరిశీలన!

Published Wed, Nov 20 2013 12:52 PM

టార్చిలైటు వెలుగులో నష్టాల పరిశీలన! - Sakshi

సాక్షి నెట్‌వర్క్: గత నెలలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థారుులో పరిశీలించేందుకు వచ్చిన కేంద్రబృందం పర్యటనకు వచ్చామా.. చూశామా.. వెళ్లామా అనే రీతిలో సాగుతోంది. నెల రోజులు ఆలస్యంగా వచ్చినా ఏదో సాయం చేయకపోతారా? అని ఆశించిన బాధిత రైతులకు బృందం పర్యటన నిరాశనే కలిగించింది. కేంద్ర అధికారుల బృందం మూడు గ్రూపులుగా విడిపోయి పంటనష్టాన్ని అంచనా వేస్తోంది. మంగళవారం ఈ బృందాలు శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించాయి. ఈ మూడు ప్రాంతాల్లోనూ పర్యటన షెడ్యూల్‌ను త్వరగా ముగించే యోచనలోనే బృందం సభ్యులు ముందుకుసాగారు కానీ, ఎక్కడా రైతుల సమస్యలను పట్టించుకోలేదు.
 
 గుంటూరు జిల్లా పంటనష్టంపై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వివేక్‌యాదవ్, జిల్లా వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్ సమగ్ర నివేదిక అందించారు. నగరపాలకసంస్థ పరిధిలో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ఫొటో ప్రదర్శనను తిలకించిన కేంద్ర  బృందం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర పరిహారం అందజేతలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచనలిచ్చారు. తాడేపల్లి, ప్రత్తిపాడు, వంగిపురం, అబ్బినేనిగుంటపాలెం, పెదనందిపాడు, కాకుమాను, అప్పాపురం, జిల్లెళ్లమూడి తదితర ప్రాంతాల మీదుగా బాపట్ల వెళ్లారు. ఎక్కడా పావుగంట కూడా సమయాన్ని వెచ్చించకుండా హడావుడిగా పర్యటన నిర్వహించారు.
 
 కాల్మొక్కుతా.. నీడ కల్పించండి..!
 తమ గ్రామంలోనూ దెబ్బతిన్న పంటలను పరిశీలించాలని కేంద్ర బృందాన్ని తక్కెళ్లపాడు రైతులు అడ్డుకున్నారు. కేంద్రబృందం జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జుసాగర్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో పర్యటించింది. త్రిపురారం మం డలం పెద్దదేవులపల్లిలో కూలిన, ధ్వంసమైన ఇళ్లను పరిశీలిస్తుండగా, ఇల్లు పూర్తిగా నేలమట్టమైన బాధితురాలు అంబటి మల్లమ్మ బృందం అధికారుల కాళ్లపై పడి తనకు నీడ కల్పించాలంటూ ప్రాధేయపడింది. ఆమెకు ఎలాంటి భరోసా ఇవ్వకుండానే వెళ్లిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో చీకటి పడిందని రైతులను కలుసుకోకుండానే వెళ్లిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు.
 
టార్చి వెలుగులో పంటల పరిశీలన
శ్రీకాకుళం జిల్లాకు మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రబృందం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చేరుకుంది. లావేరు మండలం అదపాక, బుడుమూరు గ్రామాల కు వెళ్లిన బృందం సభ్యులు అప్పటికే చీకటి పడడంతో టార్చిలైట్ల వెలుగులో పంటనష్టాన్ని పరిశీలించారు. నారాయణపురం కుడికాలువ, నారాయణసాగర్ చెరువుకు పడిన గండ్లనూ చీకట్లోనే పరిశీలించారు. బుడుమూరు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిల కించి. ఎచ్చెర్లలో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను తిలకించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక్క రైతుతోనూ మాట్లాడుకుండా కేవలం 15 నిమిషాల్లో పర్యటన ముగించుకుని చీపురుపల్లి మండలానికి వెళ్లారు. ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి జిల్లాలో జరిగిన పంటనష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement