బిల్లుపై భయాందోళనలు తొలగించాలి | Sakshi
Sakshi News home page

బిల్లుపై భయాందోళనలు తొలగించాలి

Published Mon, Dec 23 2013 2:36 AM

బిల్లుపై భయాందోళనలు తొలగించాలి - Sakshi

ఆ బాధ్యత కేంద్రం, కాంగ్రెస్‌లదే: బీజేపీ నేత వెంకయ్య

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై అభ్యంతరాలను పరిష్కరించాలని, సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తొలగించాలని, ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలదేనని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ బాధ్యత నెరవేర్చేలా వాటిపై బీజేపీ తప్పనిసరిగా ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, శేషగిరిరావు, రామచంద్రరావు తదితరులతో కలిసి ఆదివారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బిల్లులోని పలు అంశాలపై సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, మరోవైపు తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
 
ఈ నేపథ్యంలో బిల్లుపై కూలంకషంగా చట్టసభల్లో చర్చ జరగాల న్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ఈ విషయంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత ప్రగతి సాధించిన రాష్ట్రంగా అవార్డు వచ్చిందని, ఇదే ప్రగతి అయితే దాని అర్థం మారుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఎమర్జెన్సీ కాలం నాటికన్నా ఇప్పుడే ప్రజలు ఎక్కువ కోపంతో ఉన్నారన్నారు. దేశంలోని మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు ఆ పార్టీకి దూరమవుతూ, బీజేపీకి చేరువవుతున్నారని చెప్పారు. ఇటీవలి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆహారభద్రత, నగదు బదిలీ పథకం, రిజర్వేషన్లు వంటి ఎన్ని ఆశలు చూపినా అవేవీ ఓట్లు తెచ్చిపెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారంలో ఉంటూ ఇప్పుడు దేశంలో అవినీతి పెరిగిపోయిందంటున్న రాహుల్‌గాంధీ... అందుకు కారణమెవరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
పొత్తులపై అందాకా ఉహాగానాలే...
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నేతలు ఖరాఖండీగా తేల్చి చెబితే, ఈ అంశంపై వెంకయ్యనాయుడు భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తుతో ఉంటుందా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడు పొత్తులపై చర్చించి, నిర్ణయాలను మీద్వారానే ప్రజలకు తెలియజేస్తామ’’ని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే విషయాన్ని బీజేపీ ఇంతవరకు ఖరారు చేయలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ లోపు జరిగేవన్నీ ఊహాగానాలు మాత్రమేనని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement