29న ‘చలో గుంటూరు’ : మందకృష్ణ | Sakshi
Sakshi News home page

29న ‘చలో గుంటూరు’ : మందకృష్ణ

Published Mon, Sep 9 2013 1:35 AM

Chalo Guntur on Sept 29th: Manda Krishna Madiga

  • తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాల సాధనే ధ్యేయం
  •    పార్లమెంటులో బిల్లు కోసం 12, 13, 14 తేదీల్లో దీక్ష
  • సాక్షి, హైదరాబాద్: సామాజిక తెలంగాణ, సామాజికాంధ్ర, సామాజిక రాయలసీమ రాష్ట్రాల సాధన ధ్యేయంగా ఈ నెల 29వ తేదీన ‘చలో గుంటూరు’ సభ నిర్వహిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. దీనికి అంబేద్కర్‌వాదులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల భాస్కర్ మాదిగ, వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, సామాజిక న్యాయసాధన వేదిక నేత సాదుల వెంకటేశ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 
     
     తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర అగ్రకుల పెట్టుబడిదారీ వర్గాల నుంచి వస్తున్న అడ్డంకులను అధిగమించడం కోసం అంబేద్కర్‌వాదులను సంఘటితం చేయడంలో భాగంగా ప్రముఖ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే) అధ్యక్షతన ఈ సభ నిర్వహించనున్నట్లు మంద కృష్ణ తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, హైదరాబాద్‌ను యూటీ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో తాను హైదరాబాద్‌లో దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. కాగా.. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహించిన సభ తీరును మంద కృష్ణ తప్పుబట్టారు. ‘సమైక్యాంధ్ర అవగాహన సదస్సు’ అని పేరుపెట్టిన నిర్వాహకులు అసలు అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. సభా వేదికపైనుంచి మిత్రాను మాట్లాడించారని, అదేవేదికపై ఉన్న దళిత వర్గానికి చెందిన ప్రొఫెసర్ శామ్యూల్, కారెం శివాజీలకు ప్రసంగించే అవకాశం ఎందుకివ్వలేదన్నారు.
     
     సమైక్య రాష్ట్రంలో దళితులకు అన్యాయమే జరుగుతుందని ఏపీఎన్జీవోలసభే రుజువు చేసిందన్నారు. రాజ్యాధికారంలో వాటా కోసం పోరాడాలి: హక్కుల గురించి మాట్లాడుతున్న సమయంలోనే రాజ్యాధికారంలో కూడా వాటా కోసం పోరాడాలని మందకృష్ణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర కమిటీ’ నిర్వహించిన సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు. రాజ్యాధికారం అణగారిన వర్గాల చేతుల్లో ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కాగా.. ఈ సమావేశంలో తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం నూతన  అధ్యక్షుడిగా నడికుడ జయంత్‌రావు, ప్రధాన కార్యదర్శిగా మొగలిచర్ల వీరన్న, కోశాధికారిగా కొత్తపల్లి రాజమల్లయ్యలను ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement