ప్రజా ఉద్యమాలను అణచలేరు | Sakshi
Sakshi News home page

ప్రజా ఉద్యమాలను అణచలేరు

Published Mon, Mar 16 2015 2:19 AM

Chalo Hyderabad program CPM

విజయనగరం క్రైం:ప్రజా ఉద్యమాలను ఎవరూ అణచివేయలేరని, అలా చేస్తే ప్రజలే వారిని శాశ్వతంగా దూరంగా ఉంచుతారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలో ఆదివారం సీపీఎం నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇంటి ముందు వారు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు సీపీఎం నాయకులను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే మహిళా నాయకులు మాత్రం రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. తర్వాత వన్‌టౌన్‌లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను రప్పించారు. ఇంతలో విషయం తెలుసుకున్న డీఎస్పీ పీవీ రత్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న మహిళా నాయకులను అరెస్టు చేసి జైలుకు తరలిం చారు.
 
  అంతకుముందు కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్‌వాడీలు, వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించడానికి చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఆ ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను అరెస్టు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని విడిపించేంత వరకు ఆందోళన వీడేది లేదన్నారు. ప్రజా హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. కార్యక్రమంలో  సీపీఎం జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ, పార్టీ నాయకులు రెడ్డి వేణు, బి.ఇందిర, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్ మద్దతు ప్రకటించారు. లోక్‌సత్తా పార్టీ నుంచి ఎల్.భాస్కర్ హాజరై మద్దతు ప్రకటించారు. సీపీఎం నాయకుల ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటు ఎత్తుబ్రిడ్జి దాటి  వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూలో ఉండగా ఇటు కలెక్టరేట్ జంక్షన్ వరకు భారీగా  వాహనాలు నిలిచిపోయాయి.
 
 49 మంది సీపీఎం నాయకుల అరెస్ట్
 అంగన్‌వాడీ సమస్యలపై ఈనెల 17న  చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తారనే ముందస్తు సమాచారంతో పలువురు సీపీఎం నాయకులను వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనికి నిరసనగా సీపీఎం నాయకులు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వన్‌టౌన్ సీఐ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు 49 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు
 

Advertisement
Advertisement