చంద్రబాబు తెలంగాణ ద్రోహి | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తెలంగాణ ద్రోహి

Published Wed, Sep 4 2013 4:45 AM

chandhrababu naidu trying not to issue the telangana state

మక్తల్, న్యూస్‌లైన్: తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు తెలుగుజాతి ఆత్మగౌరవం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రాలేదా? అని ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, గోపాల్‌రె డ్డి ధ్వజమెత్తారు. మంగళవారం వారు మక్తల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున మద్దతు ఇస్తూ కేంద్రానికి లేఖ రాసి ఇచ్చారన్నారు.
 
 తెలంగాణకు కేంద్రం అనుకూలంగా స్పందించి సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పం దించి స్వాగతించారని గుర్తుచేశారు. ఇంతకాలం రెండుకళ్ల సిద్ధాంతం పాటించిన ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఎన్డీయే హయాంలో తాను ఒక్క ఫోన్‌కాల్‌తో తెలంగాణను ఆపగలిగానని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నాడని బహిరంగంగా ప్రకటించడమే అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పడితే తిండి గింజలు కరువవుతాయని మంత్రి శైలజనాథ్ అసత్య ప్రచారం చేయడం తగదన్నారు.
 
 కరీంనగర్ జిల్లా రైతులు పది జిల్లాలకు సరిపడా ధాన్యం పండిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దళిత ఉద్యోగులు సైతం తెలంగాణ కావాలని కోరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను సీమాంధ్ర ప్రాంతం వారు అభివృద్ధి చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో చాలా రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉందని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీమాంధ్ర నాయకులు ఈనెల 7న  హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సమైక్య సదస్సును రద్దు చేసుకోవాలని సూచించారు. ఆల్మట్టి డ్యాం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీల బృందం అనంతరం మక్తల్ నుంచి ఎమ్మెల్సీలు  కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం పరిశీలనకు వెళ్లారు. ఆల్మట్టి డ్యాం నీటి నిల్వలను రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తుందని వారు తెలిపారు.
 

Advertisement
Advertisement