కేటాయింపులు కాదు.. విదిలింపులే! | Sakshi
Sakshi News home page

కేటాయింపులు కాదు.. విదిలింపులే!

Published Wed, Mar 15 2017 6:35 PM

chandra babu naidu allots only 10 percent of bathrooms construction cost, says ys jagan mohan reddy

బాత్రూంల నిధుల విషయంలో కూడా చంద్రబాబు దారుణంగా వ్యవహరించారని వైఎస్ఆర్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సంపూర్ణ పారిశుధ్యం సాధిస్తున్నామని, అందుకోసం 7.57 లక్షల బాత్రూంలు కడతామని చంద్రబాబు తన బడ్జెట్‌లో చెప్పారని, కానీ దానికి ఆయన కేటాయించింది మాత్రం 100 కోట్లు మాత్రమేనని అన్నారు. ఒక్కో బాత్రూంకు 15 వేల చొప్పున కనీసం 1050 కోట్లు కావాలని, ఈ లెక్కన ఆయన చేసిన కేటాయింపులు ఏమూలకు సరిపోతాయని అడిగారు. రాష్ట్రంలో పూర్తిగా బహిరంగ మలవిసర్జనను అరికట్టామని ఆయన ప్రకటించారని, ఆ అవార్డు ఎవరిచ్చారో ఆయనకే తెలియాలని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థులు బాత్రూంలకు పోయే పరిస్థితి లేదని, దాంతో వాళ్లు చెంబులు పట్టుకుని కొండలెక్కుతున్నారని.. ఈ విషయం స్వయంగా తామే పరిశీలించి చూశామని ఆయన వివరించారు. ఏపీ బడ్జెట్ గురించి మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. పలు అంశాల గురించి వివరించారు.

వ్యవసాయం గురించి..

  • ఒక్క ఏడాది రికార్డు వ్యవధిలో పట్టిసీమను ప్రారంభించడం ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేయడంతో దీర్ఘకాల స్వప్నం నెరవేరిందని చెప్పారు
  • 8 కోట్ల ఘనపుటడుగుల నీళ్లతో 8 లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీరు అందించామని ఆయన అన్నారు
  • వాస్తవాలేంటో ఒక్కసారి సోషియో ఎకనామిక్ సర్వేలో గమనిద్దాం
  • ఈ 13 జిల్లాలలో 2008-09 సంవత్సరంలో ఆహారధాన్యాలను 42.70 లక్షల హెక్టార్లలో పంట వేసి, 166016 టన్నుల ఉత్పత్తి సాధించారు.
  • చంద్రబాబు సీఎం అయిన తర్వాత 2014-15లో 39.63 లక్షల హెక్టార్లలో 1.60 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి
  • 2015-16లో 41.36 లక్షల హెక్టార్లలో పంట వేసి, 143078 టన్నులకు పడిపోయింది.
  • 2016-17లో విస్తీర్ణం 41.36 లక్షల హెక్టార్లే. ఉత్పత్తి 1.50 లక్షల టన్నులు ఉంది
  • అంటే వైఎస్ హయాంలో 1.66 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక విస్తీర్ణం, పంట దిగుబడి రెండూ తగ్గాయి
  • మరి చంద్రబాబు పట్టిసీమతో ఏ రకంగా పంటలు కాపాడారో తెలియడం లేదు
  • చంద్రబాబు 2013-14లో గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా 40.96 లక్షల హెక్టార్లలో నీటి పారుదల ఉంటే, 2014-15లో తగ్గి 38.86 లక్షల హెక్టార్లకు పడిపోయింది, 2015-16లో ఇంకా తగ్గి 35.54 లక్షల హెక్టార్లకు పడిపోయింది
  • మరి చంద్రబాబు చెబుతున్న మాటలేంటి.. వాస్తవాలేంటి అనేది అర్థం కావడం లేదు
  • 136.45 కోట్ల ఖర్చుతో పట్టిసీమ నుంచి 42 టీఎంసీల నీళ్లు పంప్ చేశారు, ప్రకాశం బ్యారేజి నుంచి 55 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిపారు
  • పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 126 కోట్లు కడితే చాలు, గ్రామాలను ఖాళీ చేయిస్తామని తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల నుంచి అడుగుతోంది
  • అలా చేస్తే 48 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకోగలిగేవాళ్లం, అదే జరిగితే కృష్ణా జిల్లాలో రబీ ఎండిపోయేది కాదు
  • చంద్రబాబు సాధించిన గొప్ప విజయం ఇదీ


రైతుల పరిస్థితి ఒక్కసారి చూద్దాం..

  • రైతుల రుణమాఫీకి సంబంధించి రూ. 3600 కోట్లు కేటాయించినట్లు చెప్పారు
  • చంద్రబాబు ఈ మూడేళ్లలో రుణమాఫీకి ఇచ్చింది 10600 కోట్లు మాత్రమే
  • చంద్రబాబు సీఎం అయ్యేసరికి రైతుల వ్యవసాయ రుణాలు 87,612 కోట్లు ఉన్నాయి
  • ఏడాదికి ఆయన 3500 కోట్లు ఇచ్చి రుణమాఫీ ఇచ్చేశామని చెప్పి చెవిలో కాలిఫ్లవర్లు పెడుతున్నారు
  • చంద్రబాబు కట్టొద్దన్నందువల్ల రుణాలు కట్టకపోవడంతో ఈ రుణాలపై 16వేల కోట్ల రూపాయల అపరాధ వడ్డీ కడుతున్నారు
  • అంటే, వడ్డీలో పావలా భాగం కూడా చంద్రబాబు ఇవ్వని పరిస్థితి
  • రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులకు ఒకవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదు
  • ఈ ఏడాదికి 83 వేల కోట్ల లక్ష్యమైతే ఇచ్చింది 59 వేల కోట్లు మాత్రమే
  • ఒకవైపు రుణాలు అందడం లేదు, మరోవైపు రుణభారం పెరుగుతోంది
  • సెప్టెంబర్ 30 నాటికి 1.03 లక్షల కోట్లకు రైతుల రుణభారం పెరిగింది
  • రైతు రుణాల ఖాతాల్లో ఓవర్‌ డ్యూ, ఎన్‌పీఏ కింద 40 లక్షల అకౌంట్లు ఉన్నాయి
  • 69 వేల కోట్ల రుణాలుంటే, అందులో 25వేల కోట్లు ఓవర్‌డ్యూ, ఎన్‌పీఏలుగా ఉన్నాయి
  • ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో రైతుల బంగారాన్ని వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి
  • రైతులకు 45 వేల కోట్ల పంట రుణాలను బ్యాంకులు ఇచ్చాయని వ్యవసాయ బడ్జెట్‌లో చెప్పారు
  • దానిమీద 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే దానిమీద బ్యాంకులు వడ్డీ వసూలు చేయవు
  • 45వేల కోట్ల రుణాలకు 4 శాతం చొప్పున వడ్డీ లెక్కేస్తే దాని విలువ 1820 కోట్ల రూపాయలు
  • కానీ చంద్రబాబు దానికి ఇచ్చింది 177 కోట్లు మాత్రమే.. మరి ఏరకంగా రైతులకు న్యాయం చేశారు, ఇది మోసం చేయడం కాదా


డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఏం చేశారంటే..

  • డ్వాక్రా సంఘాలు తానే స్థాపించానని చంద్రబాబు చెబుతూ ఉంటారు
  • చంద్రబాబు సీఎం అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు 14200 కోట్ల రూపాయలు ఉంటే.. వాటిని వాళ్లు కట్టలేదు
  • బ్యాంకులు 18-24 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. వడ్డీయే ఏడాదికి 2600 కోట్లు అవుతోంది
  • నాలుగో సంవత్సరం రావడంతో వడ్డీ భారమే 10వేల కోట్ల వరకు పడుతోంది
  • చంద్రబాబు సీఎం అయిన తర్వాత డ్వాక్రా అక్కచెల్లెళ్లకు 2015-16కు సంబంధించిన వడ్డీని 577 కోట్లు ఇవ్వలేదు, 2016-17 సంవత్సరానికి 996 కోట్లు కూడా ఇవ్వలేదు. రెండూ కలిపితే ప్రభుత్వం ఇవ్వాల్సిన వడ్డీ బకాయిలే 1573 కోట్లు.
  • 2015 సెప్టెంబర్ నుంచి ఇంతవరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇచ్చిన 110 కోట్లు పాత బాకీలకు సరిపోయాయి


ఫీజు రీయింబర్స్‌మెంట్

  • దీనిపై ఆయన సిగ్గుపడినట్లున్నారు.. అందుకే దీనికి కేవలం 1300 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చూపించారు
  • 2015-16కు సంబంధించి 15 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే, కోతల తర్వాత 14 లక్షల మందికి మాత్రమే ఇచ్చింది
  • వారికి కూడా 2578 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి, 1579 కోట్లే విడుదల చేశారు
  • 2016-17కు సంబంధించి 2481 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, అందులో 527 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఇవ్వాల్సింది 1954 కోట్లు బాకీ ఉన్నారు


ఇళ్ల గురించి

  • రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామని ఆయన చెప్పారు
  • ఆయన తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఇవే మాటలు కనిపిస్తాయి.
  • 2014-15లో ఒక్క ఇల్లు కట్టలేదు, 2015-16లోనూ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు
  • దాని సంగతి దేవుడెరుగు, 5 లక్షలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో ఆగిపోతే వాటికి బిల్లులు ఇవ్వలేదు
  • 2016-17లో కూడా అదే కథ చెబుతున్నారు.. దాన్ని కొద్దిగా మార్చి 48వేల ఇళ్లకు ముగ్గులు వేశామన్నారు
  • గత సంవత్సరం బడ్జెట్ 1332 కోట్లు గృహనిర్మాణానికి పెడితే అందులో 490 కోట్లు ఖర్చు చేశారు, అది కూడా జీతభత్యాలకు 132 కోట్లు ఖర్చుపెట్టారు
  • అంటే 358 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు, అందులోనూ 40 కోట్లను మరమ్మతులకు ఇచ్చారట. అంటే కేవలం 310 కోట్లు ఖర్చు చేసి, బడ్జెట్ 1332 కోట్లు చూపించారు
  • 51 వేల ఇళ్లకు ప్రభుత్వం ఇవ్వాల్సింది సగటున లక్షన్నర చొప్పున చూసినా 718 కోట్లు అవుతాయి. కానీ ఇచ్చింది 310 కోట్లు
  • ఈ సంవత్సరం 1450 కోట్లు గృహనిర్మాణాలకు కేటాయిస్తున్నామన్నారు. ఇందులో కేపిటల్ వ్యయం 129 కోట్లే కనిపిస్తోంది. దాంతో ఎన్ని ఇళ్లు కడతారు
  • 4 లక్షల ఇళ్లకైనా లెక్క వేసుకుంటే.. కనీసం ఇంటికి లక్షన్నర చొప్పున 6వేల కోట్లు ఖర్చవుతుంది. దానికి గాను ఆయన 129 కోట్లే ఇస్తున్నారు


ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయం..

  • ఎస్సీ ఎస్టీల మీద తనకు ఎంతో ప్రేమ ఉందని ఆయన చెబుతారు
  • ఎస్సీలకు సంబంధించి 2015-16లో 8832 కోట్ల మేరకు ఉప ప్రణాళిక అమలుచేశామన్నారు.
  • 2016-17లో 9457 కోట్లుగా తేల్చారు
  • కానీ ఖర్చుపెట్టింది ఏరోజూ 60 శాతం దాటదు
  • ఎస్టీలకు సంబంధించి చూస్తే..
  • ఉప ప్రణాళికను గత సంవత్సరం నాటి 3099 కోట్ల నుంచి 3528 కోట్లకు పెంచామన్నారు
  • 2016-17కు సంబంధించి 3099 కోట్లకు గాను 2187 కోట్లే ఖర్చుపెట్టారు


నిరుద్యోగ భృతి గురించి...

  • ఈ బడ్జెట్‌లో దానికి 500 కోట్ల కేటాయింపులు చేశామని చెప్పారు
  • చంద్రబాబు సంతకం చేసి విడుదల చేసిన పాంప్లెట్‌లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేకపోతే ప్రతి ఇంటికీ నెలకు 2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు
  • రాష్ట్రంలో దాదాపు 1.75 కోట్ల ఇళ్లున్నాయి. వారికి ఒక్కొక్కరికి 2వేల చొప్పున నెలకు 3500 కోట్లు, ఏడాదికి 45 వేల కోట్లు కావాలి, కానీ దానికి గాను ఆయన 500 కోట్లు మాత్రమే ఇచ్చారు
  • అంటే, ఊళ్లో తనకు సంబంధించి కార్యకర్తలో, జన్మభూమి కమిటీల వాళ్లలో ఐదుగురికో, పదిమందికో ఇచ్చి అందరికీ ఇచ్చేశామంటారు

అనారోగ్యశ్రీ

  • ఆరోగ్యశ్రీకి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు
  • గత సంవత్సరం 910 కోట్లు అడిగితే.. 500 కోట్లే కేటాయించారు
  • తర్వాత మేం ఆరోగ్యశ్రీ గురించి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తే మరో 262 కోట్లు ఇచ్చారు
  • 2015-16కు 428 కోట్ల బకాయిలున్నాయి.
  • 108 సర్వీసులకు సంబంధించి 75 కోట్లు అడిగితే 60 కోట్లు కేటాయించి, 15 కోట్ల బకాయిలు ఉంచారు
  • ఆ వాహనాలకు పెట్రోలు బంకులలో రెండు నెలల బకాయిలు ఉన్నాయి
  • 104కు 80 కోట్లు అడిగితే 37.5 కోట్లు ఇచ్చారు, మరో 42.5 కోట్ల బకాయిలున్నాయి
  • 485 కోట్ల బకాయిలు ఇంకా ఉండగా.. ఇచ్చినవి ఏమూలకు
  • నెట్‌వర్క్ ఆస్పత్రులకు పేమెంట్లు ఇవ్వట్లేదు కాబట్టి పేషెంట్లకు వాళ్లు చికిత్సలు చేయలేకపోతున్నారు
  • 2007లో వైఎస్ ఉన్నప్పుడు నిర్ణయించిన ధరలే ఇప్పటికీ ఉన్నాయని, వాటిని రివైజ్ చేయాలని రెండేళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోలేదు
Advertisement

తప్పక చదవండి

Advertisement