బాబు డైరెక్షన్.. నేతల ఓవరాక్షన్!! | Sakshi
Sakshi News home page

బాబు డైరెక్షన్.. నేతల ఓవరాక్షన్!!

Published Tue, Aug 19 2014 2:13 PM

బాబు డైరెక్షన్.. నేతల ఓవరాక్షన్!! - Sakshi

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం హైడ్రామా నడిచింది. రాష్ట్రంలో మంటగలుస్తున్న శాంతిభద్రతల అంశంపై చర్చకు 344 నిబంధన కింద సోమవారమే వైఎస్ఆర్సీపీ నోటీసు ఇచ్చినా, దాన్ని చర్చకు చేపట్టకుండా, బుధవారం చర్చిద్దామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. బుధవారం ఎటూ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి.. ఈలోపు మనుషుల ప్రాణాల కన్నా ముఖ్యమైన అంశం ఏమైనా ఉంటుందా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడునెలల్లో జరిగిన హత్యల గురించే తాము మాట్లాడుతున్నాము తప్ప.. ఎప్పుడో జరిగిపోయినవాటి గురించి కాదని అన్నారు.

సభలో అధికారపక్షం వైఖరిని ప్రతి ఒక్క అంశంలో నిశితంగా కడిగి పారేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోలేని స్వపక్ష నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా సభలోనే డైరెక్షన్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో గానీ, అసెంబ్లీలో గానీ ఎవరెవరికి అవకాశం ఇవ్వాలో, ఎవరేం మాట్లాడాలో దగ్గరకు పిలిపించుకుని మరీ చెప్పారు. అందులో భాగంగానే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను, మంత్రి గంటా శ్రీనివాసరావును పక్కనే ఉంచుకుని వారికి చెవుల్లో తన డైరెక్షన్ ఊదారు. ఎవరేం మాట్లాడాలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలో చెప్పారు. దాంతో అప్పటినుంచి టీడీపీ నాయకుల ఓవరాక్షన్ మొదలైంది. సభలో ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిపోయిన అంశాలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించారు. అలాగే మీడియా పాయింట్లో కూడా గంటా శ్రీనివాసరావు, కాలువ శ్రీనివాసులు తదితరులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, వైఎస్ కుటుంబం మీద మాట్లాడారు.

Advertisement
Advertisement