Sakshi News home page

దిక్కుమాలిన రాజకీయం

Published Tue, Jan 7 2014 1:39 AM

దిక్కుమాలిన రాజకీయం - Sakshi

అసెంబ్లీలో చంద్రబాబు వైఖరిపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
  సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తున్నారు
 తెలంగాణ ఎమ్మెల్యేలతో విభజన ప్లకార్డులు పట్టిస్తున్నారు
 సోనియా గీసిన గీత దాటకుండా కిరణ్ మోసం చేస్తున్నారు
 రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు.. మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరితేగాని కిందికిరాని పరిస్థితి
 మధ్యలో ఇంకొక రాష్ట్రం తెస్తే నీళ్లకు దిక్కేది?
 వైఎస్ వెళ్లిపోయాక ప్రజలను పట్టించుకునేవారే లేరు
 సీఎం కాగానే ‘అమ్మ ఒడి’ పథకంపైనే నా రెండో సంతకం
 పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులేస్తాం
 
 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 ‘‘ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధనిపిస్తోంది. ఇదే గడ్డమీద పుట్టిన చంద్రబాబు తన పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. మళ్లీ ఆయనే తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విభజన చేయండీ అని ప్లకార్డులు పట్టిస్తారు. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని ఇటువంటి దిక్కుమాలిన, నీతిమాలిన రాజకీయాలు చేయాలా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఆలోచన పక్కనబెట్టి సోనియా గాంధీ గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తూ పోతున్నారని విమర్శించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర మూడో విడత, రెండో రోజు సోమవారం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగింది. నీరుగట్టువారిపల్లిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 పేదరికాన్ని దగ్గరగా చూశాను..
 ‘‘ఇవాళ రాజకీయాలు చెడిపోయాయి. చదరంగం ఆడుతున్న ట్టు.. ఒక మనిషిని తీసుకొని వెళ్లి జైల్లో పెట్టడం, మరో మని షిని తప్పించడం, ప్రాంతాలను విడగొట్టి ఓట్లు, సీట్లు సంపాదించుకునే రాజకీయాలను చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. రాజకీయాలంటే ప్రతి పేదవాని గుండె చప్పుడు వినాలి.. ప్రతి పేదవాని మనసు ఎరగాలి. చనిపోయిన తరువాత తన ఫొటో ప్రతి పేదవాని ఇంట్లో ఉండాలని ఆరాటపడటమే రాజకీయం అంటే. రాష్ట్రంలో పేదరికాన్ని దగ్గర నుంచి చూసి న నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది నేను మాత్రమేనని గర్వంగా చెప్పగలను. ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేద కుటుంబం బాధలూ చూశాను. దాదాపు 700 గుడిసెలకు వెళ్లాను. చిన్నచిన్న పిల్లలను వాళ్లు తమతో పాటు పనులకు తీసుకుపోవడం చూశాను. చాలా సందర్భాల్లో ఆ తల్లిదండ్రులను అడిగా... ‘అమ్మా..! చిన్నచిన్న పిల్లలచేత కూడా పనులు చేయిస్తుంటే.. పేదరికం ఎలా పోతుంది? వీళ్లు చదువుకుంటేనే కదమ్మా పేదరికం పోతుంది’ అని నేను అన్నప్పుడు వాళ్లు చెప్పిన మాటలు వింటే నా గుండె బరువెక్కింది. ‘‘అన్నా... మేం కూడా మా పిల్లలను చదివించుకోవాలనే ఆశపడుతున్నాం.. కానీ మొదట కడుపు నిండితేనే కదన్నా.. పిల్లల చదువు గురించి ఆలోచన చేసేది’’ అని వాళ్లు చెప్పిన మాటలు ఇప్పటికీ నా గుండెలను పిండి వేస్తూనే ఉంటాయి.
 ప్రతి అక్కా, చెల్లెమ్మలకు నేను మాటిచ్చి చెప్తున్నా. చాలా సందర్భాల్లో కూడా నేను ఈ మాట చెప్పా. ముఖ్యమంత్రిని అయిన తరువాత నేను పెట్టబోయే రెండో సంతకం గొప్ప సంతకం.
 
  ఆ గొప్ప సంతకం ‘అమ్మ ఒడి’ అనే పథకానికి శ్రీకారం చుడుతుంది. ఆ పథకం కింద ప్రతి తల్లి చేయాల్సింది ఏమిటంటే తన పిల్లలను బడికి పంపడమే. బడికి పంపిన పిల్లాడిని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లో మేం చదివిస్తాం. చదివించడమే కాదు... ఆ పిల్లాడిని ఇంజనీర్‌నో.. డాక్టర్‌నో చేస్తాం.. కలెక్టర్ లాంటి పెద్దపెద్ద చదువులు చదివిస్తాం. అలా బడికి పంపినందుకు ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున, ఒక్కో కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1,000 తల్లి అకౌంటులోనే పడుతుంది. ఎందుకు ఆ డబ్బు వేస్తున్నామంటే.. తన పిల్లలను బడికి పంపినందుకు ఆ తల్లి ఈ నెల ఎలా బతకాలి? ఇల్లు ఎలా గడవాలి? అనే ఆలోచన చేయకూడదు. అందుకే ప్రతి నెలా అమ్మ అకౌంటులోనే డబ్బు వేస్తాం.  వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం, ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టివ్వడం.. ఇలాంటివి సునాయాసంగా జరిగిపోతాయని చెప్తున్నా.
 
 మధ్యలో మరో రాష్ట్రం తెస్తే నీళ్లెలా ఇస్తారు?
 ఇవాళ ఇక్కడికి వస్తున్నప్పుడు దారిపొడవునా రైతన్నలు నన్ను చూడటం కోసం వస్తున్నారు. వారిని నీళ్ల పరిస్థితి ఏమిటన్నా అని అడిగాను. 1,000 అడుగులు బోరు వేసినా నీళ్లు పడుతాయో.. పడవో తెలియని అధ్వాన పరిస్థితుల్లో మేం ఉన్నామని ఆ రైతన్నలు చెప్పారు. ఈ మదనపల్లెలో చూస్తే.. రూపాయో... రెండు రూపాయలో పెట్టి నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీ నీవా ఇలా ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేవారే కరువయ్యారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు.. మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండిన తరువాత గాని కిందికి రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? అని సోనియాగాంధీని, చంద్రబాబును, కిరణ్‌కుమార్ రెడ్డిని అడుగుతున్నా.
 
 వైఎస్ వెళ్లిపోయాక రూపాయి రుణమైనా వచ్చిందా?
 ఇక్కడే దాదాపు 30 వేల మంది చేనేత కార్మికులు అప్పుల్లో ఉన్నారు. రూ.320 కోట్లు చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తూ నాడు వైఎస్సార్ సంతకం చేశారు. ఇవాళ ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఒక్క రూపాయి అయినా లోన్ వచ్చిందా? మాకు లోన్ వచ్చిందని ఒక్క చెయ్యి కూడా లేవదు. అంటే ఆ ఒకే ఒక వ్యక్తి వెళ్లిపోయిన తరువాత ఈ రాష్ట్రంలో చేనేత కార్మికుల గురించిగాని, రైతుల గురించిగాని, చదువుకుంటున్న పిల్లల గురించిగాని ఆలోచన చేసే వ్యక్తి ఎవరూ లేకుండా పోయారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. తెలుగువారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య ఆ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మనందరం కలసికట్టుగా ఒక్క తాటిమీదకు వద్దాం.. 30 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందామని గట్టిగా చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’
 
 జగన్‌మోహన్‌రెడ్డి వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఏఎస్ మనోహర్, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులున్నారు.
 
 విభజిస్తే 2 రాష్ట్రాలూ నాశనమే
 ఆలోచన చేయాల్సిన మన పాలకులకు బుర్ర లేకుండా పోతోంది. దేశంలో 28 రాష్ట్రాలుంటే.. మన రాష్ట్ర బడ్జెట్ మూడో స్థానంలో ఉంది. ఒక్కసారి రాష్ట్రాన్ని విభజిస్తే అప్పుడు ఒక రాష్ట్రం తొమ్మిదో స్థానం కోసం.. మరో రాష్ట్రం 13వ స్థానం కోసం పోటీ పడతాయి. విభజిస్తే రెండు రాష్ట్రాలు కూడా నాశనమయ్యే పరిస్థితి కనిపిస్తున్నా ఈ పాలకులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రం బాగుపడాలంటే ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు ఒక్కటిగా ఉండాలి. మహానగరాలు, సముద్ర తీరాలు ఒక్కటిగా ఉండాలి.. వాటిని విడదీస్తే అభివృద్ధి ఎలా ఉంటుంది?
 - వైఎస్ జగన్
 
 రెండు కుటుంబాలకు ఓదార్పు
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. సోమవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు నుంచి బయలుదేరిన జగన్ తట్టివారిపల్లెలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి  నీరుగట్టువారిపల్లెకు చేరుకున్నారు. ఇక్కడి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ను చూడ్డానికి అడుగడుగునా జనం పోటెత్తడంతో నాలుగు గంటల ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన మదనపల్లె పట్టణంలోని గొల్లపల్లె చేరుకున్నారు. ఇక్కడ కంచుకొమ్మల వెంకటరామయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడి నుంచి గంగపురం చేరుకునేసరికి రాత్రి పది గంటలు దాటింది. గంగపురంలో చెనిక్కాయల గుర్రప్ప కుటుంబాన్ని ఓదార్చారు. సోమవారం రాత్రి 11 గంటల తరువాత జగన్‌మోహన్‌రెడ్డి పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం చేరుకుని మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ఇంట బస చేశారు.

Advertisement
Advertisement