సహకరించకపోతే రైతులకే నష్టం | Sakshi
Sakshi News home page

సహకరించకపోతే రైతులకే నష్టం

Published Fri, Jul 3 2015 3:35 AM

సహకరించకపోతే రైతులకే నష్టం - Sakshi

ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలి
* పోలవరం, పట్టిసీమ, కుడికాల్వ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి
ఏలూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో రైతులు సహకరించాలని, వివాదాలు, సమస్యలు సృష్టిస్తే వారికే నష్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలను ఆగస్టు 15 లోగా, పోలవరం ప్రాజెక్టును 2018 నాటికీ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. గురువారం మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టుతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పనులనూ సీఎం పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు సైట్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమై పనుల ప్రగతిపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నాలుగు గ్రామాల్లో భూసేకరణ పూర్తయ్యిందనీ, మిగతా మూడు గ్రామాల్లోనూ నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం దగ్గర కుడికాల్వ పనులను పరిశీలించిన సీఎం అక్కడి రైతులతో కొద్దిసేపు మాట్లాడారు.
 
పనుల తీరుపై అధికారులతో సమీక్ష...
నర్సాపురంలో గోదావరి పుష్కరాల పనులను పరిశీలించి మధ్యాహ్నం 1.15 గంటలకు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి వెంటనే అధికారులతో సమావేశమయ్యారు. పోలవరం చీఫ్ ఇంజనీర్  వీఎస్ రమేష్‌బాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల ప్రగతిని వివరించారు. అక్కడక్కడా పనులు మందకొడిగా సాగుతున్నాయని గుర్తించిన సీఎం సంబంధిత పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసయాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మెగా ఈవెంట్‌గా గోదావరి పుష్కరాలు...
మెగా ఈవెంట్‌లా గోదావరి పుష్కరాలు జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పుష్కర పనులను పరిశీలించి న అనంతరం స్థానిక లయన్స్ కల్యాణ మండపంలో అధికారులతో సమావేశమయ్యారు. గామన్ ఇండియూపై ఆగ్రహం గోదావరిపై నాలుగో వంతెన నిర్మాణంలో గామన్ ఇండియా సంస్థ చేస్తున్న జాప్యం, నాణ్యతా లోపాలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నాణ్యత పాటించకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.పుష్కరాలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి రాకపోవచ్చని చంద్రబాబు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement