పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు కేంద్రమే ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు కేంద్రమే ఇవ్వాలి

Published Sun, Jun 15 2014 1:29 AM

chandra babu naidu seeks post metric scholarships

కేంద్ర మంత్రికి చంద్రబాబు వినతి
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్‌లోని విద్యార్థులకు ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను నూటికి నూరు శాతం కేంద్రం చెల్లించాల్సిందిగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి తవార్‌చంద్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని ఈ నేపథ్యంలో తమకు పూర్తి సాయం అందించాలని ఆయన కోరారు. ఈ పథకం కింద తాము రూ. 700 కోట్లు చెల్లిస్తుంటే, కేంద్రం రూ. 300 కోట్లు మాత్రమే తమకు సాయంగా అందిస్తోందని, మిగిలిన  మొత్తాన్ని కూడా కేంద్రం భరించాలని కోరారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే పథకం కింద తాము 3,238 మంది విద్యార్థులకు సాయం అందిస్తుంటే కేంద్ర మాత్రం 176 మందికి మాత్రమే నిధులు చెల్లిస్తోందని, ఆ సంఖ్యను పెంచాలని కోరారు.

 

తాము నూతనంగా ఏర్పాటు చేస్తున్న వృద్ధాశ్రమాలతో పాటు ఎస్సీల సంక్షేమానికి తగినంత సాయం చేయాల్సిందిగా కోరగా ప్రతిపాదనలు పంపాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ  సమావేశంలో రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైన కంభంపాటి రామ్మోహనరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement