సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం | Sakshi
Sakshi News home page

సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం

Published Mon, Nov 17 2014 1:28 AM

సింగపూర్ సహకారంతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం - Sakshi

మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిందిగా ఆ దేశాన్ని కోరా...రేపు రాజధాని ప్రాంత రైతులతో భేటీ
 
సాక్షి, హైదరాబాద్: సింగపూర్ ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ స్థాయిలో నిర్మించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాజధాని కోసం మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సిందిగా సింగపూర్ మంత్రులను కోరానని, వారు తమ కేబినెట్లో చర్చించి నిర్ణయం చెబుతామన్నారని పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్ వచ్చాక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఇటీవలి తన సింగపూర్ పర్యటనపైనా, ఇతర అంశాల గురించి ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాజధాని నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు విరాళాల ద్వారా సహకరించాలి. రైతులను, పేదలను కలుపుకొని నిర్మాణాన్ని చేపడతాం. దీనిపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయి. ఆ ప్రాంత రైతులతో నేనే నేరుగా మంగళవారం సమావేశమై మాట్లాడతా. రాజధాని కోసం నిర్దేశించిన ప్రాంతంలో ఉన్న 40 వేల మంది ప్రజల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయను. ప్రభుత్వం వద్ద డబ్బులు లేనందునే భూ సమీకరణ చేపట్టాం. భూసేకరణ కన్నా భూ సమీకరణ వల్లే రైతులకు ఎక్కువ లాభం.
 
 రాజధాని అంటే ఏదో ఒక్క నగరం, అసెంబ్లీ, సచివాలయం, కోర్టులే కాదు.., ఉద్యోగ, ఉపాధికి, సామాజిక జీవనానికి కూడా ఆలవాలంగా ఉండాలి. అలాంటి రాజధాని నిర్మాణం కావాలంటే సింగపూర్ సహకారం ఉండాలనే అక్కడ పర్యటించాం. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ఆ దేశ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో సహకరించటానికి ఖూ టెంగ్ షీని అధికార ప్రతినిధిగా నియమించింది. సుమారు 200 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో రాజధాని నిర్మాణం చేపడతామని చెప్పడంతో పాటు పారిశ్రామిక తదితర రంగాల్లో రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని వివరించా..’ అని చంద్రబాబు తెలిపారు.
 
 విశాఖలో మెరీనా బే తరహా ప్రాజెక్టు
 
 ‘ఇళ్ల నిర్మాణం, పర్యాటకం, ఓడ రేవుల అభివృద్ధిలో సింగపూర్ సహకారాన్ని తీసుకుంటాం. విశాఖపట్నంలో మెరీనా బే వంటి బ్రహ్మాండమైన పర్యాటక ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సెంబ్ కార్బ్ ప్రతినిధులు నెల్లూరులో 4ఁ660 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆసక్తి చూపారు. అలాగే ఎస్‌ఈజెడ్‌లను కూడా నిర్మిస్తామంటున్నారు. ఇండిగో గ్రూప్ విశాఖలో ఏవియేషన్ హబ్ ఏర్పాటుకు నిర్ణయించింది. రాజధాని నిర్మాణ ప్లానింగ్ ఇవ్వడానికి సుర్బానా కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ నిర్మాణానికి జూరాంగ్ ప్రతినిధులు అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల తరఫున నలుగురు చొప్పున ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది..’ అని సీఎం వివరించారు. జపాన్, సింగపూర్‌లు పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌వైపు చూస్తున్నాయని, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికే తాను ఆయా దేశాలకు వెళ్తున్నానని చెప్పారు. ఈనెల 23నుంచి జపాన్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. డీప్ పోర్టుల ఏర్పాటు ద్వారా ఏపీ లాజిస్టిక్ హబ్‌గా మారుతుందని చెప్పారు. జపాన్, మలేసియా, సింగపూర్, చైనా, దక్షిణ కొరియా త దితర దేశాలు ఏపీ తీరం వైపు ఉన్నందున దేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశాలు రాష్ట్రానికి ఉన్నాయన్నారు.
 
 మాస్టర్‌ప్లాన్ తయారీకి సింగ్‌పూర్ కంపెనీ సుర్భానా సంసిద్ధత!
 
 నూతన రాజధాని మాస్టర్‌ప్లాన్ తయారీకి సింగ్‌పూర్ కంపెనీ సుర్భానా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. రాజధానిని 6 జోన్లుగా నిర్మించాలని సర్కారు ప్రతిపాదిస్తోంది.
 
 రాజకీయ లబ్ధ్ది కోసమే టీఆర్‌ఎస్ విద్వేషాలు: బాబు
 
 రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కలిసికట్టుగా ముందుకు వెళదామని చెబుతుంటే ప్రతిసారీ లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వివాదాలనూ చివరకు వ్యక్తిగత అంశాలుగా మారుస్తోందని ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వం రేపుతున్న వివాదాలను కేంద్రానికి వివరిస్తామని, అక్కడ పరిష్కారం దొరక్కపోతే కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. శ్రీశైలంపై ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.  
 
 పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును, ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.తెలంగాణ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై మాట్లాడుతూ.. ‘ముందు రాష్ట్రంతో వివాదాలకు దిగుతున్నారు, తర్వాత టీడీపీపై, అలాగే హెరిటేజ్‌పైనా పడుతున్నారు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ రాదు, పైగా వారే ప్రజల ముందు చులకన అవుతారు..’ అని చెప్పారు. ఇంటర్మీడియెట్ పరీక్షలను విడిగా నిర్వహించాలని నిర్ణయించడంపై స్పందిస్తూ.. ‘‘అదొక్కటే ఏమిటి? చాలా చేస్తున్నారు. ఇక ముందూ  ఎక్కువే చేస్తారు. వారికి కావలసింది వివాదాలు రేపడం ద్వారా రాజకీయ లబ్దే తప్ప ప్రజలు, వారి సమస్యల పరిష్కారం కానేకాదు’’ అని మండిపడ్డారు.  
 
 ఇలాగైతే హైదరాబాద్‌లో ఎవరుంటారు?
 
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు 1956 ముందునుంచీ ఉన్న వారు మాత్రమే స్థానికులంటూ చట్టాన్ని తేబోతే కోర్టు మొట్టికాయలు వేసిందని చంద్రబాబు చెప్పారు. 1956 అని అంటే హైదరాబాద్‌లో ఎవరుంటారని ప్రశ్నించారు. ఉత్తరాదినుంచి వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ ఉంటున్నారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణకే నష్టమని అన్నారు.
 
 బదిలీల్లో వివాదాలతో పరువు తీస్తున్నారు
 మంత్రులపై సీఎం చంద్రబాబు మండిపాటు
 
 రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలతో ప్రభుత్వ పరువు పోతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులే ఆరోపణలు చేసుకుంటూ రోడ్డుకెక్కి ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చారంటూ ఆదివారం వారితో టెలికాన్ఫరెన్సు మండిపడ్డారు.నిర్వహించారు. విశాఖ జిల్లాలో ఆర్డీఓ బదిలీపై మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వివాదం రేగి వీధులకెక్కడ ంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వారి వివరణ కోరారు.  టెలికాన్ఫరెన్సు తరువాత అయ్యన్నవచ్చి బాబును ఆయన నివాసంలో కలిసి వివరణ ఇచ్చారు. తాను సీఎంఓ అధికారులను దుర్భాషలాడినట్లు ప్రచారం జరగడం సరికాదని అనంతరం మీడియాతో అయ్యన్న చెప్పారు. అనంతరం గంటా వర్గీయులు బాబును కలిశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement