సీఎం హామీలన్నీ హుళక్కే! | Sakshi
Sakshi News home page

సీఎం హామీలన్నీ హుళక్కే!

Published Wed, May 4 2016 4:03 PM

chandra babu naidu srikakulam trip

సీఎం హోదాలో ఆరుసార్లు చంద్రబాబు పర్యటన
మూడు పర్యటనల్లో పలు హామీలు
ఒక్కటీ నెరవేరని వైనం
నేటి పర్యటనపై ప్రజల అనాసక్తి


శ్రీకాకుళం : ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇప్పటివరకూ ఆరుసార్లు జిల్లాలో పర్యటించారు. అయితే ఈ సందర్భంగా ప్రజలకిచ్చిన హామీల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా 2014 సెప్టెంబర్‌ 18న, అక్టోబర్‌ 15, అదే నెల 23వ తేదీల్లో జిల్లాలో పర్యటించారు. అలాగే 2015 ఫిబ్రవరి 11, అదేనెల 14, 2016 ఫిబ్రవరి 12 తేదీల్లో కూడా పర్యటించారు. తొలిసారిగా వచ్చినప్పుడు పెద్దగా హామీలు ఇవ్వలేదు. 2015 ఫిబ్రవరి 11న ఎచ్చెర్ల శాసనసభ్యుడు కిమిడి కళావెంకటరావు తనయుడి వివాహానికి హాజరయ్యారు. 2016 ఫిబ్రవరి 12న ఎన్‌జీవోల రాష్ట్ర సభలకు హాజరై ఎన్జీవో నాయకులు అడిగిన పలు సమస్యలను పరిష్కరిస్తానని మాత్రమే చంద్రబాబు చెప్పారు. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదు. హుద్‌హుద్‌ తుఫాను సందర్భంలో అక్టోబర్‌ 15న శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

తురాయిచెట్టువీధి  లోతట్టుగా ఉందని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి ఇక మీదట ఆ ప్రాంతంలో వరదముప్పు లేకుండా ఎత్తుచేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను తక్షణం పంపించాలని సూచించడంతో ఆ ప్రక్రియను వెనువెంటనే పూర్తిచేశారు. అయితే అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇదే సందర్భంలో పొందూరు మండలంలోని కింతలి, మొదలవలస గ్రామాల్లో పర్యటించిన సీఎం రెల్లిగెడ్డకు వరదలు రాకుండా, గ్రామానికి, పొలాలకు, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు దృష్టిసారించిన పాపాన పోలేదు. అటు తర్వాత అదే ఏడాది అక్టోబర్‌ 23న శ్రీకాకుళం రూరల్‌ మండలంలో పర్యటించారు. కుందువానిపేటలో పలువురు మత్యకారుల ఇళ్లు దెబ్బతిన్నాయని గుర్తించి ఆ గ్రామంలోని మత్స్యకారులందరికీ తుపానుకు తట్టుకొనేలా ఆధునిక పద్ధతుల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి అధికారులకు ఆదేశించారు. ఈ హామీ కూడా నెరవేరలేదు. 2015 ఫిబ్రవరి 14న జిల్లాలో పర్యటించినప్పుడు నరసన్నపేటలో బహిరంగ సభలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణానికి రింగురోడ్డును నిర్మిస్తామని, దీనికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిధులు మంజూరు కాకపోవడంతో అధికార పార్టీ నేతలు సైతం దీన్ని మరిచిపోయారు. ఇదే వేదిక నుంచి నరసన్నపేటలో రింగురోడ్డు, రాజుల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, జగన్నాథపురంలో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా అవన్నీ ప్రతిపాదనల దిశలోనే ఉండిపోయాయి. జలుమూరు మండలం శ్రీముఖలింగంలో రక్షిత మంచినీటి పథకం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా నేటికీ అది ప్రకటనగానే నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితిలో బుధవారం ఏడోసారి చంద్రబాబు జిల్లాకు వస్తుండగా.. ప్రజలు ఆయన పర్యటనపై ఆసక్తి చూపుతున్నట్టు లేదు. ఆయన ఇచ్చే హామీలను వినడానికి ఏ ఒక్కరూ సుముఖత చూపడం లేదు. అమలుకు నోచుకోని హామీల వల్ల ఉపయోగం ఏమిటని పెదవి విరుస్తున్నారు.  

నేడు ‘ఉపాధి’కి సెలవు!
శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం, గార, ఆమదాలవలస నియోజకవర్గాల్లోని పలు గ్రామాల వేతనాదారులకు అధికార పార్టీ పెద్దలు బుధవారం సెలవు ప్రకటించారు. చంద్రబాబు శ్రీకాకుళం రూరల్‌ మండలంలో పర్యటిస్తున్నందున ఉపాధి పనులకు సెలవు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వెళ్లేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు కొంతమంది నాయకులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ సమాచారం మంగళవారం నాటికే  వేతనదారులకు చేరడంతో మండుటెండలో రోజంతా సీఎం కార్యక్రమంలో ఎలా పాల్గొనాలా అని ఆందోళన చెందుతున్నారు. జన సమీకరణ, రవాణా బాధ్యతలను ఉపాధి హమీ క్షేత్ర సహాయకులు, వెలుగు సిబ్బందికి అప్పజెప్పారు.   

భారీ బందోబస్తు
శ్రీకాకుళం సిటీ :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేథప్యంలో ఎస్పీ ఏఎస్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక అడిషినల్‌ ఎస్పీ, 13 మంది డీఎస్పీలు, 26 మంది సీఐలు, 75 ఎస్సైలు, 166 ఏఎస్‌ఐ/హెచ్‌సీలు, 584 కానిస్టేబుళ్లు, 97 మంది మహిళా కానిస్టేబుళ్లు, 255 మంది హాంగార్డులను బందోబస్తు కోసం నియమించారు. వీరితోపాటు ఒక ఆర్మడ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్, నలుగురు ఆర్‌ఎస్సైలు, 33 మంది ఎస్సైలు, 196 పోలీస్‌కానిస్టేబుళ్లు కూడా విధుల్లో ఉంటారు.

Advertisement
Advertisement